ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ 10 వేల డాలర్లు (రూ.7 లక్షలు) దాటింది. ఫేస్ బుక్ ‘లిబ్రా’ పేరిట సొంత బిట్ కాయిన్ లావాదేవీలు ప్రారంభిస్తామని చెప్పడంతోపాటు అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో లావాదేవీల నిర్వహణకు ‘బిట్ కాయిన్’ బెటరన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ చాలా రోజుల తర్వాత 10వేల డాలర్ల మార్కును దాటింది. 2018 తర్వాత ఈ మార్కును దాటడం ఇదే ప్రథమం. శనివారం ఉదయం 8.94శాతం పెరిగి 10,591.12 డాలర్లకు చేరినట్లు క్రిప్టో కరెన్సీ ట్రాకింగ్ వెబ్‌సైట్ కాయిన్ మార్కెట్ కాప్ పేర్కొంది.
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ లిబ్రా పేరుతో క్రిప్టోకరెన్సీని తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ బిట్‌కాయిన్ ధర కూడా పుంజుకోవడం గమనార్హం. బిట్‌కాయిన్‌ను తొలిసారి 2008లో తయారు చేశారు.
2011 నాటికి ఒక డాలర్‌కు ఒక బిట్‌కాయిన్ లభించేది. ఆ తర్వాత దీని విలువ రేసుగుర్రాన్ని తలపించేలా పరుగులు తీసింది. 2017నాటికి ఒక బిట్‌కాయిన్ 20వేల డాలర్లకు సమానమైంది. కానీ, ఆ తర్వాత పలు దేశాలు క్రిప్టోకరెన్సీలపై ఆంక్షలు విధించడంతో దీని విలువ క్రమంగా పతనమైంది.
2018 డిసెంబర్‌లో అత్యల్పంగా 3,250 వద్ద ట్రేడైంది. దీంతో ఈ కరెన్సీ ఇక ఎప్పటికీ పుంజుకోదని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. కానీ , వారి అంచనాలను తలకిందులు చేస్తూ బిట్‌కాయిన్ మళ్లీ ర్యాలీ మొదలుపెట్టింది.
మూడు వారాల క్రితమే బిట్ కాయిన్ 8,700 డాలర్ల మార్కును దాటేసింది. ఇటీవల బిట్‌కాయిన్ల అపహరణ గణనీయంగా పెరిగిపోయింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజీల అంచనాల ప్రకారం దాదాపు 40 మిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్లు హ్యాకర్ల బారిన పడ్డాయి. అయినా కానీ వీటి ధర ఈ ఏడాది దాదాపు 200 శాతానికి పైగా పెరిగి 10వేల డాలర్లను దాటేసింది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బిట్‌కాయిన్‌ను సురక్షితమైందిగా ఎంచుకోవడం దీనికి కారణంగా భావిస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ అయిన ఫిడెలిటీతోపాటు ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా క్రిప్టోకరెన్సీల కొనుగోళ్లు విక్రయాలకు అనుమతించడం మరో కారణం.
మరోపక్క సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కూడా క్రిప్టోకరెన్సీ తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికోసం చెల్లింపు సేవల సంస్థలను, ఈ కామర్స్ సంస్థలను, క్రిప్టోకరెన్సీ సంస్థలను భాగస్వాములుగా చేసుకోవడం కూడా బిట్‌కాయిన్‌కు కలిసివచ్చాయి.
బిట్‌కాయన్ల లావాదేవీలు భారత్‌లో చట్టబద్ధం కాదు. ఆర్‌బీఐ పరిధిలో పనిచేసే ఏ సంస్థ కూడా వీటితో లావాదేవీలను నిర్వహిచదు. క్రిప్టోకరెన్సీలను నియంత్రిస్తూ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొని రావాలని ఫిబ్రవరిలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బిట్‌కాయిన్లకు కళ్లెం వేయండి: ఎఫ్‌ఏటీఎఫ్
ఫ్లొరిడా: బిట్‌కాయిన్ల వినియోగానికి కళ్లెం విధించేలా నిబంధనలను రూపొందించాలని ఆయా దేశాల ప్రభుత్వాలు కళ్లెం వేయాలని ఎఫ్‌ఏటీఎఫ్‌లో పలు సభ్యదేశాలు అభిప్రాయపడ్డాయి.
బిట్‌కాయిన్లను మనీలాండరింగ్‌కు వినియోగించకుండా ఉండేలా ఈ చర్యలు ఉండాలని పేర్కొన్నాయి. ముఖ్యంగా క్రిప్టోకరెన్సీలను మనీ లాండరింగ్‌కు వాడకుండా ఎక్స్‌ఛేంజిలు చూడాలన్నాయి.
ప్రపంచంలో మనీలాండరింగ్‌ను అణచివేసేందుకు 30ఏళ్ల క్రితం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. దీనిలో అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, భారత్ వంటి శక్తివంతమైన దేశాలకు సభ్యత్వం ఉంది.
క్రిప్టోకరెన్సీలు అనుమతించే దేశాలు వాటిని నిర్వహించే సంస్థల జాబితాను ఉంచుకోవాలని ఎఫ్‌ఏటీఎఫ్ తెలిపింది. వీటి వినియోగదారుల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరింది.
‘అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీని ప్రభుత్వాల కళ్లు గప్పి నిధులను చట్ట విరుద్ధ కార్యక్రమాలకు మళ్లేంచేందుకు వాడకుండా చూడాలి’ అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ తెలిపారు.
యూరోపూల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడుతూ.. యూరోపియన్ పోలీస్ ఏజెన్సీలు పక్కదేశాల్లో విచారణ నిర్వహించేలా పరస్పరం సహకరించుకోవాలి. నేరగాళ్లకు నిధులను ఇచ్చేందుకు క్రిప్టోకరెన్సీలు సాయం చేస్తున్నాయని నేను గమనించాను’ అని పేర్కొన్నారు.
‘ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. దేశాలు వేగంగా స్పందించాలి. ఇది చాలా అత్యవసరం.క్రిప్టో కరెన్సీలకు చెల్లింపులు చేసే డార్క్ వెబ్‌పై ఇప్పటికే ఒక కన్నేసి పెట్టాము.
కొన్ని సందర్భాల్లో బిట్‌కాయిన్లతో పాటు కొత్తగా గుర్తుతెలియని క్రిప్టోకరెన్సీల్లోకి మార్చేస్తారు’’ అని ఎప్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్షల్ బిల్లింగ్‌స్లే తెలిపారు. ఫేస్‌బుక్ తీసుకొచ్చే లిబ్రా మాత్రం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించదని యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.
