Asianet News TeluguAsianet News Telugu

అనిల్‌కు ఆసరా.. జియోకు దన్ను

రిలయన్స్ సోదరులకు ఊరటకల్పించే పరిణామం ఒకటి చోటు చేసుకున్నది. ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకమ్యూనికేషన్స్‌కు ఆయన తమ్ముడు అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కాం వద్ద గల స్పెక్ట్రం విక్రయించడానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అయితే టెలికం శాఖకు రూ.1400 కోట్ల కార్పొరేట్ గ్యారంటీ రెండు రోజుల్లో చెల్లించి, వారంలోగా ఎన్వోసీ తీసుకోవాలని ఆదేశించింది. దీంతో రూ.46 వేల కోట్ల రుణాల ఊబిలో చిక్కుకున్న అనిల్ అంబానీకి స్పెక్ట్రం విక్రయంతో రూ.17,300 కోట్లు లభించనున్నాయి.

Billionaire Anil Ambani Clears Court Hurdle to Sell Telecom Assets to His Brothers Firm
Author
New Delhi, First Published Dec 1, 2018, 11:19 AM IST

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కాం)కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. సోదరుడు  ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియోకు స్పెక్ట్రం అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా జియోకు ఆస్తుల అమ్మకానికి గల అడ్డంకులను అత్యున్నత న్యాయస్థానం తొలగించింది. కాకపోతే టెలికం శాఖ (డాట్) వద్ద రూ.1400 కోట్ల కార్పొరేట్ గ్యారంటీ నగదు చెల్లించిన తరువాత మాత్రమే తుది ఆమోదం లభిస్తుందని నిబంధన విధించింది. రెండు రోజుల్లో కార్పొరేట్ గ్యారంటీని చెల్లిస్తే, వారంలోగా డాట్ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్ లభిస్తుందని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.

రుణభారాన్ని తగ్గించుకునేందుకు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు స్పెక్ట్రమ్‌, ఇతర ఆస్తులను విక్రయించనున్నట్లు ఆర్‌కామ్‌ గతేడాది ప్రకటించింది. స్పెక్ట్రమ్‌ విక్రయ ప్రతిపాదనను డాట్‌ తిరస్కరించింది. అప్పుల భారం నుంచి బయటపడేందుకు వైర్‌లెస్‌ స్పెక్ట్రం, టవర్, ఫైబర్‌, మీడియా కన్వర్జెన్స్ నోడ్ (ఎంసిఎన్) ఆస్తులను జియోకు విక్రయించేందుకు ఆర్‌కాం సిద్ధమైంది. 

సుమారు రూ.46వేల కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే వ్యూహంలో స‍్పెక్ట్రం ఆస్తుల అమ్మకం ఆర్‌కాంకు చాలా ముఖ్యం. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఆర్ కాం అధినేత అనిల్ అంబానీ తన వద్ద గల స్పెక్ట్రం తన అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని జియో ఇన్ఫో కమ్యూనికేషన్స్‌కు రూ.17,300 కోట్లకు విక్రయించేందుకు మార్గం సుగమమైంది. 

 స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కింద రూ.2940 కోట్లు ఆర్‌కామ్‌ బకాయి పడిందని డాట్‌ పేర్కొంది. దీనిపై ఆర్‌కామ్‌ టీడీశాట్‌ను ఆశ్రయించింది. భూమిని హామీగా స్వీకరించి నిరభ్యంతర పత్రాన్ని జారీ చేయాల్సిందిగా టీడీశాట్‌ ఆదేశించింది. టీడీశాట్‌ ఉత్తర్వులపై డాట్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.  సుప్రీం తాజా ఆదేశాలతో ఎరిక్‌సన్‌ ఇండియాకు చెల్లించాల్సిన రూ.550 కోట్ల బకాయిలకు మార్గం సుగమమైంది. 

చిన్న చిన్న ఒప్పందాలను పూర్తి చేసే పద్ధతులన్నీ అంబానీ బ్రదర్స్ పూర్తి చేసుకున్నారు. కానీ తాజాగా స్పెక్ట్రం విక్రయం కోసం డాట్ క్లియరెన్స్ కోసం ఆర్ కాం ఎదురుచూస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆర్ కాం షేర్లు శుక్రవారం 12 శాతం ఎగసిపడ్డాయి. అప్పుల వల్ల ఈ ఏడాదిలో 60 శాతం ఆర్ కాం షేర్లు నష్టపోయాయి. 

ఆర్ కాం తరఫున విచారణకు హాజరైన కపిల్ సిబాల్ మాట్లాడుతూ అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రియాల్టీ.. డాట్‌కు రెండు రోజుల్లో నూతన కార్పొరేట్ గ్యారంటీ రూ.1400 కోట్లను చెల్లిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇంతకుముందు రూ.1400 కోట్ల విలువైన భూమిని గ్యారంటీగా పత్రాలు సమర్పిస్తుందని ఆర్ కాం వాదించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios