భారత్ బంద్ ఎఫెక్ట్ బ్యాంకింగ్ సేవలపై భారీగా పడింది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎంప్లాయిస్ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంంతో ఆర్థిక కార్యకలాపాలు కుంటుబడ్డాయి. ఏకంగా 20 లక్షల చెక్కులు క్లియర్ కాలేదు. ఈ బంద్ ప్రభావం ఆర్థిక సామాన్యులు ఇబ్బందులు పాలవుతున్నారు. 

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో రెండో రోజైన మంగళవారం బ్యాంకింగ్ సేవలు, ప్రజారవాణా కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. దాదాపు అన్ని ప్రాంతాల ఉద్యోగులు, కార్మికులు ఈ సమ్మెలో భాగమయ్యారని, గ్రామీణ ప్రాంతాల్లోనూ దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని కార్మిక సంస్థ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్‌ కౌర్‌ తెలిపారు. ఈ సమ్మెలో అటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఉద్యోగులు కూడా చేరారని ఆమె తెలిపారు.

సమ్మెలో 20 కోట్ల మందికి పైగా ఉద్యోగులు - AITUC
సమ్మెలో మొదటి రోజు 20 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారని, రెండో రోజు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మికులు, రైతులు, సామాన్యులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె ద్వారా కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటీకరణ ప్రణాళికను తిరస్కరించాలని, జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్‌ను మూసివేయాలని, MGNREGA కింద కేటాయింపులను పెంచాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కార్మిక సంఘాలు ప్రముఖంగా డిమాండ్ చేశాయి.

18,000 కోట్ల విలువైన 20 లక్షల చెక్కులు క్లియర్ కాలేదు: AIBEA
ఈ సమ్మెకు బ్యాంకింగ్‌ ఉద్యోగుల సంఘాల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ యోచనకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘాలు అందులో భాగమవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడింది.

 సమ్మె ప్రారంభమైన తొలిరోజు ఉద్యోగులు రాకపోవడంతో దేశవ్యాప్తంగా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన 20 లక్షల చెక్కులను క్లియర్ చేయలేకపోయామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA) కూడా ఈ సమ్మెలో భాగమయ్యాయి.