బ్యాంక్ ఉద్యోగులకు కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై అన్ని శనివారాలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలలో మాత్రమే మూసివేయబడ్డాయి.

కానీ అదనంగా శనివారలు కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించింది. "పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని బ్యాంక్ శాఖలకు సంబంధించి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం 2వ మరియు 4వ శనివారాలలో ప్రస్తుత సెలవులకు అదనంగా అన్ని శనివారాలు ప్రభుత్వ సెలవుదినాలుగా ప్రకటిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.

 " ఫైనాన్స్ (ఆడిట్) విభాగం నిన్న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని తెలిపింది. "ఇది తక్షణమే అమలులోకి వస్తుంది, తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు ఇది అమలులో ఉంటుంది" అని తెలిపింది. కొరోనా వైరస్ బారిన పడుతున్న బ్యాంకు ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలిపారు.

also read ఐబీఎంకు ప్రధాని మోదీ ఆఫర్‌.. పెట్టుబడులు పెట్టడానికి ఇదే గొప్ప సమయం.. ...

పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులలో పనిచేసే  2 వేల మంది ఉద్యోగులు కోవిడ్ -19 బారిన పడ్డారని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒసి) రాష్ట్ర కార్యదర్శి సంజయ్ దాస్ తెలిపారు.

అంతకుముందు రోజు సమాచార, సాంస్కృతిక శాఖ అన్ని శని, ఆదివారాల్లో శాఖలను మూసివేస్తున్నట్లు, సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వినియోగదారులకు సేవలను అందించాలని విజ్ఞప్తి చేస్తూ బ్యాంకులకు సలహా ఇచ్చింది.

బ్యాంకు సంఘాలు వారంలో ఐదు రోజుల పాటు మాత్రమే పని దినాలను కల్పించాలి అంటూ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి.  ఇందుకు భారతీయ బ్యాంకుల సంఘంతో పలు రౌండ్ల చర్చలు జరిపాయి. "కోవిడ్-19 వ్యాప్తి ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము స్వాగతిస్తున్నాము.

చివరకు మా చట్టబద్ధమైన డిమాండ్ ని  రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది" అని ఏ‌ఐ‌బి‌ఓ‌సి అఖిల భారత ఉమ్మడి ప్రధాన కార్యదర్శి అయిన దాస్ అన్నారు. గత వారం, కేరళ ప్రభుత్వం కూడా ఇదే విధమైన ఉత్తర్వులను జారీ చేసింది, కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని శనివారాలలో అన్ని బ్యాంకులు మూసివేయనుంది.