రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌లో ఉన్న ఆస్తుల తాలూకు పత్రాల వివరాలను అందజేసేలా ఆయా సంస్థలను ఆదేశించాలని 13 భారత్‌ ప్రభుత్వ రంగ బ్యాంకులు లండన్‌ కోర్టును ఆశ్రయించాయి. 

బ్యాంకులు కోరుతున్న ఆస్తుల్లో మాల్యా విలాసవంతమైన యాట్చ్‌లు, రేసింగ్‌  కార్లు, ఇంతర అంశాలు ఉన్నాయి. వీటి యాజమాన్య వివరాలను వెల్లడించాలని బ్యాంకులు కోరుతున్నాయి. అందుకు కొన్నేళ్లు పట్టవచ్చని బ్యాంకులు భావిస్తున్నాయి. 

మరోపక్క ఆస్తుల జప్తు వ్యవహారాన్ని నిలిపి వేయాలని కోరుతూ బుధవారం మాల్యా లండన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే భారతీయ బ్యాంకులు తనకు వ్యతిరేకంగా దివాళా పిటిషన్‌ను దాఖలు చేశాయని దానిని ఇక్కడ విచారించలేరని వాదించారు.

ఈ దివాళా పిటిషన్‌ ఈ ఏడాది చివర్లో విచారణకు రావచ్చని భావిస్తున్నారు. గతేడాది మే ఎనిమిదో తేదీన బెంగళూరు డెట్‌ రిజల్యూషన్‌ ట్రైబ్యూన్‌ ఇచ్చిన తీర్పును బ్రిటన్‌ కోర్టులో నమోదు చేసేందుకు ఆ దేశ హైకోర్టు అనుమతినిచ్చింది.  

దీంతోపాటు ఇంగ్లాండ్‌, వేల్స్‌లో మాల్యాకు చెందిన రూ.10,499 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను ఆదేశించింది.ఇప్పటికీ విజయ్‌ మాల్యా పేరుతో ఇంకా భారీగా ఆస్తులు ఉండి ఉంటాయని భారత్‌ బ్యాంకులు గుర్తించాయి.

వీటిని సీజ్ ‌చేయడం అధికారులకు సాధ్యం కాలేదు. దీనికి తగ్గట్లే మాల్యా కూడా తన పేరుతో కొన్ని కార్లు, ఆభరణాలు తప్పితే ఏమీ లేవని తెలిపారు. టెవిన్‌ ఎస్టేట్‌ తన కుమారుడిదని, లండన్‌లోని టౌన్‌ హౌన్‌ తన తల్లిదని పేర్కొన్నారు.

పలు బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశీ ఆస్తులపై బ్యాంకులు దృష్టి సారించాయి. ఇప్పటికే దేశీయంగా ఆయనకు ఉన్న ఆస్తులను బ్యాంకులు జప్తు చేశాయి.

విదేశాల్లో ఆయన పెట్టిన పెట్టుబడులు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డాయి 13 బ్యాంకులు. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎస్‌బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకుల వద్ద రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నది.

వడ్డీతో కలుపుకొని ప్రస్తుతం ఈ రుణాలు ఇంచుమించు రూ.10 వేల కోట్లకు చేరాయి. కాగా ఆయన ఆస్తుల విలవు 1.14 బిలియన్ డాలర్లు(రూ.10,499 కోట్లు) ఉంటాయని గుర్తించాయి.