అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దంపై వచ్చే నెలలో చర్చలు జరుగనున్నట్లు వచ్చిన వార్తలు స్టాక్ మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు ఏమాత్రం రుచించలేదు. రెండు నెలల క్రితం ప్రపంచ కుబేరుడిగా అవతరించిన అమెజాన్‌ సంస్థ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో 19.2 బిలియన్‌ డాలర్ల (రూ.1.40 లక్షల కోట్ల పైమాటే) సంపదను కోల్పోయి రికార్డు సృష్టించారు. గతంలో ఎన్నడూ రెండు రోజుల ట్రేడింగ్‌లో ఇంత పెద్ద మొత్తంలో సంపద కోల్పోలేదని బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. 

స్టాక్స్‌ను తరుముతున్న అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి
అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు నెలకొంటాయనే భయాందోళనల నేపథ్యంలో మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో జెఫ్‌ బెజోస్‌కు చెందిన 19.2బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. గత శుక్రవారం 8 బిలియన్ డాలర్లు, సోమవారం 8.2 బిలియన్ డాలర్ల చొప్పున తగ్గింది.

నాస్‌డాక్‌లో లిస్టైన అమెజాన్ షేర్లు గడిచిన వారం చివర్లో 6.3 శాతానికి పైగా పతనమయ్యాయి. అమెజాన్ సంస్థలో ప్రస్తుతం ఆయనకు 16 శాతం వాటా ఉన్నది. దీంతో బెజోస్ సంపద 128.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతక్రితం నెలలో ఇది 167.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

గతంలో 16.5 బిలియన్ల డాలర్ల సంపద కోల్పోయిన మార్క్ జుకర్ బర్గ్
గతంలో ఈ రికార్డు ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేరిట ఉంది. జులైలో 16.5బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోయారు. సోమవారం టెక్నాలజీ స్టాక్స్‌ నష్టపోయాయి. ఏప్రిల్‌ తర్వాత నాస్‌డాక్‌ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరింది. అమెజాన్‌ షేర్లు 6.3శాతం పడిపోయాయి. శుక్రవారం అత్యధికంగా 7.8శాతం పడిపోయాయి.

దీంతో జెఫ్‌ బెజోస్‌ సంపద 128.1బిలియన్‌ డాలర్లకు చేరింది. గత నెల ఆరంభంలో ఆయన ఆస్తి విలువ 167.7బిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రపంచ సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ రెండు రోజుల ట్రేడింగ్‌లో 558.3మిలియన్‌ డాలర్లు కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ఆస్తి 92.8బిలియన్‌ డాలర్లుగా ఉంది.

కొనసాగుతున్న రూపాయి పతనం
రూపాయి పతనం కొనసాగుతున్నది. ఈక్విటీ మార్కెట్లు పడిపోవడం, మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో రూపాయితో పోలిస్తే డాలర్ మారకం విలువ 23 పైసలు తగ్గి రూ.73.68 వద్దకు జారుకున్నది. 73.58 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 73.70కి పతనం చెందింది.

దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు భారీగా పెరుగడం, దిగుమతిదారులు డాలర్‌ను కొనుగోలు చేయడానికి మొగ్గుచూపడం వల్లనే రూపాయిపై మరింత ఒత్తిడి పెరిగిందని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. ఇంధన ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రూపాయి పతనం కొంత ఆందోళనను సృష్టిస్తున్నదని చెప్పారు.

ముడి చమురు ధరలు తగ్గినా సూచీలపై తప్పని ఒత్తిళ్లు
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గుముఖం పట్టినా సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 2.84 శాతం పతనమైంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నియంత్రించడానికి తగు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో చమురు రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. వీటితోపాటు ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌షీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, కోల్ ఇండియా, సన్‌ఫార్మాలు 3.5 శాతం వరకు క్షీణించాయి. అయినప్పటికీ ఇన్ఫోసిస్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, టీసీఎస్, టాటా మోటార్స్‌లు రెండు శాతంకు పైగా లాభపడ్డాయి.