Amazon: మీరు అమెజాన్ వెబ్ సైట్ లో తరచూ ఏదో ఒకటి కొంటుంటారా? అయితే ఇకపై మీరు ఏది కొన్నా రూ.5 ఎక్స్‌ట్రా చెల్లించాలి. ఈ మేరకు అమెజాన్ ప్రకటన చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా కీలకమైన మార్పును తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ఆర్డర్లపై రూ.5 మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీజును ప్రైమ్ సభ్యులు కూడా కట్టాలని తెలిపింది.
అన్ని ఆర్డర్లపై ఒకసారి కడితే చాలు
రూ.5 మార్కెట్ ఫీజును అన్ని ఆర్డర్లపై ఒకసారి మాత్రమే చెల్లిస్తే చాలని అమెజాన్ ప్రకటించింది. ఇది మొత్తం బిల్లులో కూడా చేరిపోతుందని తెలిపింది.
మార్కెట్ ఫీజు వసూలుకు కారణం ఏంటంటే?
ఈ అదనపు ఛార్జ్‌కి గల కారణాలను వివరిస్తూ అమెజాన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కస్టమర్లందరికీ విలువైన షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఫీజును వసూలు చేస్తున్నాం. మిలియన్ల బ్రాండ్లు, ఉత్పత్తులతో నడిచే ఈ ప్లాట్‌ఫారాన్ని నిర్వహించేందుకు ఇది అవసరమవుతుంది” అని తెలిపింది.
ఈ ఫీజు ఎక్కడ వర్తించదంటే..?
సాధారణ వినియోగదారులు, ప్రైమ్ సభ్యులు కూడా మార్కెట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. రశీదుల్లో ప్రత్యేకంగా ఈ ఛార్జ్ కనిపిస్తుంది. ఈ ఫీజులో సంబంధిత పన్నులు కూడా కలిసి వుంటాయి.
గిఫ్ట్ కార్డుల కొనుగోలు చేసేటప్పుడు ఈ మార్కెట్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అమెజాన్ బిజినెస్, బజార్, అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ఆర్డర్లు చేసినప్పుడు కూడా కట్టాల్సిన పని లేదు. రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపులు, టికెట్ బుకింగ్‌లు, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు చేసినప్పుడు కూడా మార్కెట్ ఫీజు కట్టక్కరలేదు.
జొమాటో, స్విగ్గీ ఇప్పటికే వసూలు చేస్తున్నాయి
ఈ విధమైన మార్కెట్ ఫీజు విధానం Zomato, Swiggy వంటి ఫుడ్ డెలివరీ యాప్‌లలో ప్రారంభమైంది. ప్రారంభంలో రూ.2 నుంచి ప్రారంభమైన ఫీజులు, ఇప్పుడు రూ.11 వరకు పెరిగాయి. ఈ అదనపు ఆదాయం కంపెనీల ఆర్థిక నివేదికల్లోనూ కనిపించిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడుతుంది
రూ.5 ఛార్జ్ చిన్న మొత్తంగా కనిపించినా, తరచూ షాపింగ్ చేసే వినియోగదారులకు ఇది అదనపు భారం కావచ్చు. ముఖ్యంగా ప్రైమ్ సభ్యులు ఈ ఛార్జ్‌ను అదనపు భారంగా ఫీలవ్వచ్చు. ఎందుకంటే వారికి ఫ్రీ షిప్పింగ్ సౌకర్యం ఉండే అవకాశం ఉంది. ఆ డబ్బులు ఇలా వసూలు చేస్తున్నారని ప్రైమ్ వినియోగదారులు అనుకొనే అవకాశం ఉంటుంది.