బతుకమ్మ, విజయదశమి, దీపావళి పండుగల సీజన్ ప్రారంభమైంది. సెల్ ఫోన్లు మొదలు హోం అప్లియెన్సెస్, వెహికల్స్, ఆభరణాల వరకు అన్ని రకాల అమ్మకాలకు కలిసొచ్చే సమయం ఇది.

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోం అప్లయెన్సెస్ ఉత్పాదక సంస్థలు, డీలర్లకు చాలా ముఖ్యమైన సీజన్. ఇదే అదనుగా ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ రాయితీలు ఆఫర్ చేస్తూ అమ్మకాలకు సిద్దమయ్యాయి. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం మాల్ సైతం ఈ పోరులో తానూ పాల్గొనంటూ ఉవ్విళ్లూరుతున్నది.

ఆర్థిక మందగమనం నుంచి ఉపశమనం కలిగించేందుకు కంపెనీలకు కార్పొరేట్ పన్ను రూపంలో భారీ రాయితీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో కంపెనీలు కూడా ఉత్పత్తుల ధరలను తగ్గించి వేస్తున్నాయి.

నూతన మోడల్ ఫోన్ల కోసం కొనుగోలు దారుల ఫోకస్
జీఎస్టీ రేట్లలో మార్పులు, ధరల తగ్గింపుతోపాటు నూతన మోడళ్ల కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారులు ఈ సీజన్‌లో విజ్రుంభిస్తారని ఆన్ లైన్ రిటైల్ పోర్టళ్లతోపాటు విక్రయ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. ఈ కామర్స్ రిటైల్ విక్రయాలే రూ.25000 కోట్ల పై చిలుకు ఉంటాయని అంచనా.

అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 60 శాతం విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నారు. 2018 పండుగల సీజన్‌లో ఈ -కామర్స్ అమ్మకాలు రూ.16 వేల కోట్లు జరిగాయి. 

ఈ ఏడాది సేల్స్ రూ.25 వేల కోట్ల మార్క్ దాటే చాన్స్
ఈ ఏడాది ప్రస్తుత పండుగ సీజన్‌లో రూ.25000 కోట్ల వరకు ఆన్ లైన్ పోర్టళ్లలో విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ సారి పండుగ సీజన్ లో 3.2 కోట్ల మంది ఆన్ లైన్ కొనుగోలు జరుపుతారని, దాదాపు 7.5 కోట్ల లావాదేవీలు జరుగుతాయని రెడ్ సీర్, ఫోరెస్టర్ వంటి కన్సల్టింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

2018లో 4.6 కోట్ల విక్రయాలతో పోలిస్తే ఈసారి ఇవి 60 శాతం అధికంగా ఉండొచ్చని పేర్కొంది. ఆన్ లైన్ పోర్టళ్ల వార్షిక అమ్మకాళ్లో ఈ పండుగ సీజన్ వాటా 15 శాతం వరకు ఉంటుందని అంచనా. 

కొత్త ఫోన్లు ఆవిష్కరిస్తున్న స్మార్ట్ ఫోన్ సంస్థలు
ఆపిల్ సహా దిగ్గజ స్మార్ట్ ఫోన్ల సంస్థలన్నీ ప్రస్తుత సీజన్‌లో కొత్త మోడల్ ఫోన్లు ఆవిష్కరిస్తున్నాయి. ఈ సందర్భంలోనే పాత మోడళ్ల ధరలను తగ్గించివేస్తున్నాయి.

ఈ స్థాయి ఆదాయ వర్గీయులు ఆ స్థాయిలో తమకు అనువైన వస్తువులు ఎంచుకుంటారు. జూన్ తర్వాత విక్రయాలు మందగించడంతో రాయితీలు, ఉచిత బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ సంస్థలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 

సులభ వాయిదాలతో కొనుగోలు అవకాశాలు
సంప్రదాయ దుకాణాలు, ఆన్ లైన్ పోర్టళ్లలో వడ్డీలేని సులభ వాయిదాల్లో కొనుగోలు అవకాశాలు పెరిగాయి. కొన్ని బ్యాంకులు కూడా తమ కార్డులతో కొనుగోలుతో రాయితీలు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందజేస్తున్నాయి. 

ఇలా వివిధ సంస్థల ఆఫర్ల వర్షం
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్- ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తోపాటు దీపావళి విత్ మీ పేరుతో షియోమీ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఆపర్లు అందిస్తున్నాయి. ఇక మహా క్యాష్ బ్యాక్ ఆఫర్ పేరిట ఈ నెల 29 నుంచి అక్టోబర్ ఆరో తేదీ వరకు పేటీఎం మాల్ ఆఫర్లను అందిస్తున్నది. 

ఐఫోన్‌ ఎక్స్ఆర్ పై రూ.10 వేలు రాయితీ: త్రూ ఓన్లీ అమెజాన్ 
ఐఫోన్‌ ప్రియులకు ఈ – కామర్స్‌ రిటైల్ సంస్థ అమెజాన్‌ తీపి కబురు అందించింది. ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4వ తేదీ వరకు జరపనున్న సేల్స్‌లో ఐఫోన్లపై భారీగా తగ్గింపు ప్రకటించింది. ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌పై ఏకంగా రూ.10 వేలు తగ్గించింది. 
అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు ముందుగా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. 

ఐఫోన్ ఎక్స్ఆర్ వేరియంట్ల ధరలు ఇలా 
ధర తగ్గింపు తర్వాత ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ 68 జీబీ మోడల్‌ రూ. 39,999, 128 జీబీ వేరియంట్‌ రూ. 44,999, 256 జీబీ ఫోన్‌ రూ.57,999లకు లభిస్తాయి. ఈ ఆఫర్‌ పరిమిత సమయంలో మాత్రమే ఉంటుందని అమెజాన్‌ ఇండియా తెలిపింది. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఇంత తక్కువ ధరకు ఇంతకుముందెన్నడూ లభ్యం కాలేదని అమెజాన్ వెల్లడించింది. 

అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం పొందడం ఇలా
అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు కానివారు నెలకు రూ.129, సంవత్సరానికి రూ. 999 చెల్లించి సభ్యత్వం పొందవచ్చు. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఫోన్‌లో డ్యూయల్‌ సిమ్‌ సౌకర్యంతోపాటు 6.1 లిక్విడ్‌ రెటీనా ఎల్‌సీడీ డిస్‌ప్లే, 12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా, 7 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా అమర్చారు.

ఇంకా రీచార్జబుల్‌ లిథియం ఐయాన్‌ బ్యాటరీ వైర్‌లెస్‌ చార్జింగ్‌, ఫేస్‌ ఐడీ వాటర్‌, డస్ట్‌ రెసిస్టింగ్‌, ఏ12 బయోనిక్‌ చిప్‌ ప్రాసెసర్‌ ఉంది. ఈ ఫోన్ ఆరు రంగులు.. వైట్, బ్లూ, కోరల్, ఎల్లో, బ్లాక్ అండ్ ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో లభ్యం కానున్నది.