డిజిటల్ టెక్నాలజీ అభివ్రుద్ధి చెందుతున్నా కొద్దీ వినియోగదారులకు రిటైల్ మార్కెట్ మరింత చేరువవుతోంది. దీని ఫలితంగా ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలకు, రిటైల్ మేజర్లకు మధ్య దోస్తీ పెరిగిపోతున్నది.

మొన్న వాల్‌మార్ట్- ఫ్లిప్‌కార్ట్ డీల్, నిన్న అమెజాన్-మోర్ ఒప్పందం నేపథ్యంలో విలీనానికి కాదంటే వాటాల విక్రయమై తాజాగా చైనా రిటైల్ మేజర్ అలీబాబాకు దేశీయ రిటైల్ మేజర్ స్పెన్సర్స్ మధ్య చర్చల ధోరణి ఆయా సంస్థల స్నేహం లేదంటే విలీనానికి కాదంటే వాటాల విక్రయానికి అద్దం పడుతోంది.

స్పెన్సర్స్ సంస్థలో 30 శాతం వాటాల కొనుగోలు చేయడంపైనే అమెజాన్ కేంద్రీకరించిందని సమాచారం. మైనారిటీ వాటా కొనుగోలు చేసేందుకు 400 మిలియన్ల డాలర్లకు పైగా స్పెన్సర్స్ సంస్థకు అమెజాన్ ఆఫర్ ఇచ్చిందని వినికిడి.

ప్రపంచంలోనే అత్యంత జనాభా గల మనదేశ మార్కెట్‌లో పాగా వేసేందుకు గ్లోబల్ రిటైల్, ఈ-కామర్స్ దిగ్గజాలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా వ్యాపార పరంగా స్థానిక సామీప్య సంస్థలపై దృష్టి పెడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఆర్‌పీ-సంజీవ్ గోయెంకాల (ఆర్‌పీజీ గ్రూప్)కు చెందిన ఫుడ్, గ్రాసరీ రిటైల్ విభాగం స్పెన్సర్స్త్‌తో చైనా బహుళ వ్యాపార దిగ్గజం అలీబాబాతో స్వల్ప వాటా అమ్మకానికి చర్చలు జరుపుతున్నది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 

ఇప్పటికే అమెజాన్‌తోనూ స్పెన్సర్స్ సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో అమెజాన్, అలీబాబా రెండింటిలో ఏదో ఒకదాని చేతికి స్పెన్సర్స్ వాటా చిక్కవచ్చన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కాగా, ఇటీవల ఆర్‌పీజీ గ్రూప్ ప్రధాన కార్యాలయాల్లో అలీబాబా ప్రతినిధులతో సమావేశం జరిగిందని సదరు వర్గాలు తెలిపాయి. అయితే గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు.

నిజానికి ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ల డాలర్లతో వాల్‌మార్ట్ తమ అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచే అటు అమెజాన్, ఇటు అలీబాబా దేశీయ మార్కెట్‌లో తమ పట్టును కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.

ఇందులో భాగంగానే ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన మోర్ రిటైల్‌తో అమెజాన్ ఈమధ్యే ఓ భారీ డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. సమర క్యాపిటల్, అమెజాన్‌లకు ఆదిత్యా బిర్లా రిటైల్‌ను అమ్మేసేందుకు ఆదిత్యా బిర్లా గ్రూప్ ఒప్పందం చేసుకోగా, విలీనం తర్వాతీ సంస్థ విలువ 42 బిలియన్ డాలర్లుగా ఉంటుందని మార్కెట్ అంచనా.