Asianet News TeluguAsianet News Telugu

ఇది పక్కా: దీపావళికే ఎయిరిండియా సేల్స్.. అప్పటిదాక నో సేల్స్, ప్రమోషన్స్

  • ఇప్పటి వరకు ‘మహారాజా’గా సర్వభోగాలు అందించిన ఎయిరిండియా కనుమరుగు కానున్నది. రోజు రూ.15 కోట్ల ఆదాయం సముపార్జించిన ఎయిరిండియాలో 11 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. 
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఎయిరిండియా విక్రయానికి అవసరమైన కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Air India freezes promotions, new recruitment amid stake sale preparations
Author
New Delhi, First Published Jul 22, 2019, 11:21 AM IST

న్యూఢిల్లీ: ప్రతి ఇంటిలోకి దీపావళి కొత్త కాంతులు తీసుకొస్తుందని నానుడి. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా (ఏఐ) సిబ్బంది కుటుంబాల్లో కొత్త కాంతులకు బదులు చీకట్లు నిండబోతున్నాయి. దీపావళి నాటికి ఎయిరిండియా విక్రయానికి కేంద్రం రంగం సిద్ధమవుతోంది. అందుకే సంస్థలో కొత్త నియామకాలు, పదోన్నతులను నిలిపివేయాలని ఆదేశించింది.

వీలైనంత తర్వగా ఎయిర్‌ ఇండియా అమ్మకం పూర్తి చేసేందుకు మోదీ సర్కార్‌ యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఎఐ)లో ఉద్యోగుల పదోన్నతులు, కొత్త నియామకాలు నిలిపివేసింది. రూ.50వేల కోట్ల రుణభారంతో సతమతం అవుతున్న ఎయిరిండియా (ఎఐ)లో వాటా విక్రయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో, నియామకాలు స్తంభింపచేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. 

పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (డీఐపీఏఎం) నుంచి ఎయిర్‌ ఇండియాకు ఈ మేరకు ఆదేశాలు అందినట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఎయిర్‌ ఇండియా అమ్మకానికి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది జరిగిన వారంలోనే కొత్త నియామకాలు, ప్రమోషన్లు పక్కన పెట్టాలని ఆదేశించడం విశేషం.

వాటా విక్రయ ప్రక్రియ కోసం.. ఎయిరిండియా ఖాతాలను ఈనెల 15వ తేదీన ముగించామని, ఈ వివరాలనే వీటిని బిడ్‌ల ప్రక్రియ కోసం వినియోగించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితిపై ఎయిరిండియా (ఎఐ) యాజమాన్యం స్పందించలేదు. దీనిపై పౌర విమాన యాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా నుంచి కూడా సమాధానం రాలేదు. 

ఎయిరిండియా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి బకాయిలను పెండింగ్‌లో ఉంచొద్దని అన్ని విభాగాల అధిపతులను ఎయిరిండియా ఆదేశించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ సంగతి గత వారం జరిగిన కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఎయిరిండియా హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ అమ్రితా శరణ్‌ విభాగాధిపతులకు తెలియజేశారు.

ప్రస్తుతం రోజుకు ఎయిరిండియాకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. వచ్చే 4- 5 నెలల్లో ఎయిరిండియా వాటా విక్రయం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం 24 శాతం వాటాను అట్టేపెట్టుకోవాలని భావించడం, అధిక రుణ భారం వల్లే వాటా విక్రయం ప్రయత్నాలు విఫలమయ్యాయని లావాదేవీ సలహాదారు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) తన నివేదికలో పేర్కొంది. 

ఎయిరిండియాలో వాటా విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి ఈనెల 3న తెలిపారు. వాటా విక్రయానికి ముందే కార్యకలాపాలు మెరుగుపరుస్తామని అన్నారు. దీపావళి, అంతకంటే ముందే ఎయిరిండియాలో వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తామని పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి అతాను చక్రవర్తీ ఇప్పటికే తెలిపారు.

ఎయిర్‌ ఇండియాలో ఇప్పటికే 20,000 మందికిపైగా ఉద్యోగులు ఉంటే వారిలో దాదాపు 11,000 మంది శాశ్వత ఉద్యోగులు. ప్రైవేట్‌ ఎయిర్‌లెన్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీంతో ఎయిర్‌ ఇండియా జీతాల భారం ఎక్కువగా ఉంది. గత ఏడాది ఎయిర్‌ ఇండియా అమ్మకం కోసం బిడ్స్‌ ఆహ్వానిస్తే ఒక్క బిడ్‌ కూడా రాలేదు. ప్రైవేటీకరణ తర్వాత ఉద్యోగుల తొలగింపు ఉండకూడదన్న షరతు కూడా ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
మరోవైపు దీపావళికల్లా ఎయిర్‌ ఇండియా అమ్మకం ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఏ షరతులపై ప్రైవేట్‌ కంపెనీల నుంచి బిడ్స్‌ ఆహ్వానించాలనే విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) సిద్ధం చేస్తోంది. ‘ఎయిర్‌ ఇండియా అమ్మకంపై మాకెలాంటి అనుమానాలు లేవు. ఇందుకోసం వేగంగా జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే, ఎయిర్‌లైన్‌ నిర్వహణ త్వరలోనే ప్రైవేట్‌ పార్టీల చేతికి బదిలీ కాబోతోంది’ అని ఎయిర్‌ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios