Asianet News TeluguAsianet News Telugu

అడ్గుగోడలా ఈయూ కమిషన్: థైసెన్‌క్రప్‌తో టాటా స్టీల్ విలీనానికి ‘నో’

అంతర్జాతీయంగా లక్ష్మీ మిట్టల్ సారథ్యంలో ఆర్సెలర్ మిట్టల్ అనే స్టీల్ కంపెనీ తర్వాత స్థానాన్ని ఆక్రమించాలన్న టాటా స్టీల్ - థైసెన్ క్రప్ యత్నాలు ఫలించలేదు. రెండు సంస్థలు విలీనమయ్యేందుకు రంగం సిద్ధమైన ఐరోపా కమిషన్ అభ్యంతరాలు తెలిపింది. దీంతో విలీన ప్రతిపాదన నిలిచిపోయినట్లు రెండు సంస్థలు తెలిపాయి.

Advantage China, As Tata Steel Merger Stopped By European Commission
Author
Bombay, First Published May 11, 2019, 3:29 PM IST

ముంబై: తమ సంస్థ ఐరోపా కార్యకలాపాలను జర్మనీలోని థైసెన్‌క్రప్‌తో విలీనం చేయాలన్న యత్నాలు ఫలించడం లేదని టాటా స్టీల్‌ తెలిపింది. దీనికి ఐరోపా కమిషన్‌ (ఈసీ) అభ్యంతరాలే కారణమని స్పష్టం చేసింది. 

ఇరు సంస్థలు భారీ పరిహార ప్యాకేజీని తెలిపినా, ఈసీ అంగీకరిచలేదని టాటా స్టీల్‌ గ్రూప్‌ శుక్రవారం పేర్కొది. చెరి సగం భాగస్వామ్యంతో ఐరోపా వ్యాప్తంగా సంయుక్త సంస్థ ఏర్పాటు చేయాలని టాటాస్టీల్‌ యూరప్‌, థైసెన్‌క్రప్‌ గతేడాది జూన్‌ 30న ఒప్పందం చేసుకున్నాయి. ఐరోపా ఖండంలో లక్ష్మీ మిట్టల్ సారథ్యంలోని ఆర్సెలార్‌ మిట్టల్‌ తరువాత రెండో అతిపెద్ద స్టీల్‌ కంపెనీగా ఇది అవతరించాలన్నది ఈ రెండు సంస్థల లక్ష్యం.

ఈ ప్రతిపాదనను ఐరోపా కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలించింది. రెండు స్టీల్‌ దిగ్గజ సంస్థల విలీనం వల్ల విపణిలో హైఎండ్‌ షీట్ల సరఫరాలో పోటీ ఉండదని తేల్చింది. ఇదే విషయాన్ని శుక్రవారం ఇరు సంస్థలకూ శుక్రవారం తెలిపింది. 

‘మాకు అందిన సమాచారం మేరకు, సంయుక్త సంస్థ ఏర్పాటుకు ఐరోపా కమిషన్‌ అంగీకరించడం లేదు. ఆస్తుల విక్రయం వంటివి ప్రతిపాదనల్లో ఉండటమే ఇందుకు కారణం’ అని టాటా స్టీల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. కమిషన్‌ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించేందుకు, ఆందోళన కలిగించే అంశాలపై ఒక సమగ్ర పరిహార ప్యాకేజీని కూడా తెలిపినట్లు టాటా స్టీల్‌ పేర్కొంది. 

సంయుక్త సంస్థకు సంబంధించి సమగ్ర పారిశ్రామిక వ్యూహం రూపొందిస్తామని, ఖాతాదార్ల సేవల కోసం సమీకృత వ్యవస్థను అభివృద్ధి చేస్తామని, ఐరోపా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సంస్థాగత సవాళ్ల పరిష్కారానికి స్థిర వ్యాపార వ్యూహాలు సూచించినట్లు టాటా స్టీల్‌ వెల్లడించింది. ‘అయితే మార్కెట్‌ పరిస్థితుల వల్ల, అందిన సూచనలను అనుసరించి, సంయుక్త సంస్థ ప్రతిపాదనకు ఈసీ అంగీకరించడం లేదు’ అని టాటా స్టీల్‌ స్పష్టం చేసింది. 

పరిహార ప్యాకేజీని మరింత పెంచితే, సంయుక్త సంస్థ ఏర్పాటు లక్ష్యమే దెబ్బతింటుందని టాటాస్టీల్‌ పేర్కొంది. అందువల్ల సంయుక్త సంస్థ ఏర్పాటును ఈసీ ఆమోదించదనే ఇరు సంస్థలు భావిస్తున్నాయని టాటాస్టీల్‌ వెల్లడించింది. థైసెన్‌క్రప్‌తో కలిసి సంయుక్త సంస్థ ఏర్పాటు చేయడం ముఖ్యమైన వ్యూహాత్మక ఎత్తుగడగా టాటాస్టీల్‌ గతంలో అభివర్ణించింది. 

ఐరోపాలో సుస్థిర వ్యాపారం సమకూర్చుకోవడం, రుణభారం తగ్గించుకునేందుకు దీన్ని వినియోగించుకోవాలనుకున్నది. భవిష్యత్తులో ఇందుకోసం ప్రయత్నిస్తామని, ఏ అవకాశాన్ని వదులుకోబోమని స్పష్టం చేసింది. ఐరోపా కార్యకలాపాలపై సామర్థ్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది.

టాటా స్టీల్‌తో సంయుక్త సంస్థ ఏర్పాటు ప్రతిపాదన ముందుకెళ్లే పరిస్థితులు కనిపించనందున, రెండు స్వతంత్ర సంస్థలుగా కంపెనీని విడదీయాలనే ప్రతిపాదనను థైసెన్‌క్రప్‌ ఏజీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు నిలిపేసింది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగు పరచుకుంటామని స్పష్టం చేసింది. 

విలువ పరంగా మరింత సౌకర్యవంత పోర్ట్‌ఫోలియో అందుబాటులోకి తెస్తామని థైసెన్‌క్రప్‌ తెలిపింది. సంయుక్తసంస్థ ప్రతిపాదన విఫలమవ్వడంతో, ప్రపంచవ్యాప్తంగా 6,000 ఉద్యోగాల్లో కోత విధిస్తున్నామని, ఇందులో 4,000 జర్మనీలోనే ఉంటాయని థైసెన్‌క్రప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ గుదో కెర్క్‌ఆఫ్‌ పేర్కొన్నారు.

2017 సెప్టెంబర్ నుంచి ఉన్న ప్రతిపాదన ప్రకారం.. ఇరు సంస్థల విలీనంతో ఏర్పాటయ్యే సంయుక్త సంస్థ థైసెన్‌క్రప్‌ టాటాస్టీల్‌గా ఉంటుంది. 34 ప్రాంతాల్లోని యూనిట్లలో మొత్తం 48 వేల మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. ఏడాదికి 2.1 కోట్ల టన్నుల స్టీల్‌ను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. సంస్థ ఆదాయం 15 బిలియన్‌ యూరోలు (సుమారు రూ.1.20 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా వేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios