కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ వ్యక్తి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం అయ్యారు. ఎవరూ టచ్ చేయలేని స్థాయిలో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.  ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..? అదానీ విషయంలో అదే జరిగింది మరి.. ప‌లు రంగాల్లో అడుగు పెట్టిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు హెల్త్‌కేర్ సెక్టార్‌లో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.  

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోన్నారు. ఇప్పటికే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, షిప్పింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్, పోర్ట్స్, ఎయిర్‌పోర్ట్స్ వంటి రంగాల్లో అడుగు పెట్టిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు హెల్త్‌కేర్ సెక్టార్‌లో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఓ మేజర్ హెల్త్‌కేర్ కంపెనీని టేకోవర్ చేయడానికి మంతనాలు సాగిస్తోంది. అపోలో హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి మెట్రోపోలిస్ హెల్త్‌కేర్‌‌ను కొనుగోలు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఈ డీల్ విలువ ఒక బిలియన్ డాలర్లు. మెట్రోపోలిస్ హెల్త్‌కేర్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌, ఆ కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సమానమైన మొత్తాన్ని ఖర్చు చేయాలని భావిస్తోంది. అపోలో హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్‌గా ఇందులో పెట్టుబడులు పెట్టనుంది.

మెట్రోపోలిస్ హెల్త్‌కేర్.. పేరుతో దేశవ్యాప్తంగా డయాగ్నస్టిక్స్ అండ్ పాథాలజీ చైన్ లాబొరేటరీ సెంటర్స్ ఉన్నాయి. 1980లో ఏర్పాటైన ల్యాబ్స్ సంస్థ ఇది. 19 రాష్ట్రాల్లో దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దక్షిణం, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ సెగ్మెంట్‌లో ఈ సంస్థకు గట్టిపట్టు ఉంది. డాక్టర్ సుశీల్ షా దీన్ని నెలకొల్పారు. ప్రస్తుతం అమీరా షా మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఈ చైన్ హెల్త్‌కేర్ క్లినిక్స్‌ను టేకోవర్ చేసుకోవడం ద్వారా ఈ సెగ్మెంట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలనేది అదానీ భవిష్యత్ ప్రణాళిక. హెల్త్‌కేర్ రంగంలో అడుగు పెట్టాలనే ఉద్దేశంతోనే గౌతమ్ అదానీ.. ఇదివరకే అదానీ హెల్త్‌ వెంచర్స్ పేరుతో ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కిందటి నెల 17వ తేదీన ఇది ఇన్‌కార్పొరేట్ అయినట్లు ప్రకటించింది. దీని ద్వారా హెల్త్‌కేర్ కార్యకలాపాలను నిర్వహించడానికి అదానీ పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. 

ఎనిమిదేళ్లల్లో పలు రంగాల్లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్‌పోర్టులు, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇప్పటివరకు హెల్త్‌కేర్ సెక్టార్‌లో అడుగు పెట్టలేదు. అపోలోతో కలిసి మెట్రోపొలిస్ హెల్త్‌కేర్‌ను టేకోవర్ చేయడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తోంది.