పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్‌ను ఆదుకునేందుకు మరో 24 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అబుదాబీకి చెందిన ఎతిహాద్ సంస్థ ముందుకు రావడం లేదు. ఇతర మదుపర్లు ఎవరూ జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునేందుకు ముందుకు రాకపోవడంతో దాని ప్రమోటర్ నరేశ్ గోయల్ కూడా ఎతిహాద్ పైనే ఆధారపడుతున్నారు.

కానీ రెండు సంస్థల యాజమాన్యాల మధ్య అంత సత్సంబంధాలు ఉన్నట్లు పరిణామాలు కనిపించడం లేదని పరిస్థితులు చెబుతున్నాయి. మరో 24 శాతం వాటా విక్రయిస్తే జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్‌గా నరేశ్ గోయల్ వాటా మైనారిటీలో పడుతుంది..

అయినా చైర్మన్ హోదాతోపాటు యాజమాన్యంపై తన మార్కు ఉండాలని పట్టుబడుతున్నారని ఆయన సన్నిహిత వర్గాల కథనం. కానీ భాగస్వామ్య ఎతిహాద్ సంస్థ మాత్రం ఆయన పాత్ర తగ్గించుకోవాలని పరోక్షంగా బ్యాంకులకు లేఖ రాయడం ద్వారా తేల్చేసింది. 

తన షరతులకు ఎతిహాద్ తలొగ్గకపోవడంతో నరేశ్ గోయల్ తన వాటా షేర్లను తనఖా పెట్టుకుని రూ.700 కోట్ల రుణాలివ్వాలని ఎస్బీఐ చైర్మన్ రజనీస్ కుమార్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ సంస్థలో నరేశ్ గోయల్ వాటా 51 శాతం.

దీనికితోడు రుణ వాయిదాలను చెల్లించడంలో గతనెలలో జెట్ ఎయిర్వేస్ విఫలమైనా.. ఎస్బీఐ తదితర బ్యాంకర్లు సమయోచిత పరిష్కార మార్గాన్ని ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ఎస్బీఐ చీఫ్‌కు ఎతిహాద్ చీఫ్ టోనీ డౌగ్లాస్ లేఖ సంచలనాలకు దారి తీసింది.

జెట్ ఎయిర్వేస్‌కు చెందిన ఒక్కో షేర్‌పై రూ.150కి మించి చెల్లించలేమని డౌగ్లాస్ రాసిన లేఖ సారాంశం. తాజాగా ఎస్బీఐ వద్ద తీసుకునే రుణం కూడా వారం రోజుల పాటు మనుగడ సాగించడానికే పనికి వస్తుందని డౌగ్లాస్ తేల్చారు. 

ఎస్బీఐ చీఫ్‌కు రాసిన లేఖ ప్రతిని ఎతిహాద్ చీఫ్ డౌగ్లాస్.. కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబేకు కూడా పంపారు. దీంతో జెట్ ఎయిర్వేస్, దాని భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని అర్థమవుతోంది. కానీ ఈ లేఖలో వివరాలను జెట్ ఎయిర్వేస్ నిరాకరిస్తోంది. 

ఇదంతా జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ కం చైర్మన్ నరేశ్ గోయల్ స్వయంక్రుతాపరాధమేనని దుబాయికి చెందిన ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి మార్క్ మార్టిన్ పేర్కొన్నారు. ఎంతోకాలం జెట్ ఎయిర్వేస్ మనుగడ సాగించడం కష్ట సాధ్యమని తేల్చేశారు.

దీనికి తోడు ఎతిహాద్ సంస్థ కూడా 3.5 బిలియన్ల డాలర్లకు పైగా నష్టాలను చవి చూడడం కూడా జెట్ ఎయిర్వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంజ వేయడానికి మరో కారణమని చెబుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నిబంధనల మేరకు ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఆ సంగతి ఎతిహాద్ సంస్థకు కూడా తెలుసునని, అందుకోసమే షరతులు విధించిందని మలేషియాకు చెందిన రీసెర్చ్ సంస్థ ఇండౌ వ్యవస్థాపకుడు షుకొర్ యూసుఫ్ చెప్పారు.

మరోవైపు నరేశ్ గోయల్ భవితవ్యంపై అనిశ్చితి, ఎతిహాద్ స్వీయ ఆర్థిక సమస్యలతో జెట్ ఎయిర్వేస్ కష్టాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేశ్ గోయల్ తన సొంత మనీ 100 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి యాజమాన్య హక్కులను కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకోగలనని, కానీ ఆయన రూ.700 కోట్ల రుణం కోసం చేస్తున్న ప్రయత్నాలు బక్కెట్ నీటిలో చుక్కవంటివేన్నారు జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈఓ స్టీవ్ ఫొర్ట్. ఇలా తీసుకునే రుణాలతో జెట్ ఎయిర్వేస్ మరింత నష్టపోతుందని తేల్చేశారు. 

సరిగ్గా ఆరేళ్ల క్రితం 2013లోనూ జెట్ ఎయిర్వేస్ సంస్థలో ఎతిహాద్ తొలిసారి 24 శాతం వాటా కొనుగోలు చేయడానికి ముందు 15 నెలలు పట్టింది. నరేశ్ గోయల్, ఆయన మేనేజ్మెంట్ సిబ్బంది 46 సార్లు అబుదాబీకి, ముంబైకి మధ్య చక్కర్లు కొట్టారు. అప్పట్లో నెలకొన్న సంక్షోభ సమయంలో జెట్ ఎయిర్వేస్ మరింత ప్రజాదరణను కోల్పోయింది. 

ఈ నేపథ్యంలో రూ.2000 కోట్ల పెట్టుబడి పెట్టడంతోపాటు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసింది ఎతిహాద్. జెట్ ఎయిర్వేస్ బిల్లులను కూడా ఎతిహాద్ చెల్లించేసింది. సంక్షోభం నుంచి జెట్ ఎయిర్వేస్ సంస్థను బయటపడేసిన తర్వాత యాజమాన్యం, నియంత్రణ చర్యలు చేపట్టేందుకు ఎతిహాద్ సంస్థను నరేశ్ గోయల్ అనుమతించలేదు. 

ఫలితంగా ఎతిహాద్ సీఈఓ, ఆయన ప్రతినిధుల రాక క్రమంగా తగ్గింది. రెండు సంస్థల మధ్య కమ్యూనికేషన్లు కూడా తగ్గిపోయాయి. కానీ ఎతిహాద్ సంస్థతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం పదేపదే చెబుతూ వచ్చింది. 

ఎతిహాద్ సంస్థ ఎయిర్ బెర్లిన్, అలిటాలియా వంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో నిధుల కొరత సమస్య కూడా ఉన్నది. మేనేజ్మెంట్‌లో మార్పులు రావడంతో జెట్ ఎయిర్వేస్ బోర్డు సభ్యులైన సీఎఫ్ఓ జేమ్స్ రిగ్నీ, సీఈఓ హోగన్ వైదొలగాల్సి వచ్చింది. ఫలితంగా నరేశ్ గోయల్ ఇతర ప్రత్యామ్నాయాలపై కేంద్రీకరించక తప్పలేదు.

ఫ్రాన్స్ కేఎల్ఎం, డెల్టా ఎయిర్ లైన్స్, అట్లాంటిక్ పార్టనర్ సంస్థలతో నరేశ్ గోయల్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కోడ్ షేర్ కస్టమర్లతో నరేశ్ గోయల్ ఒప్పందాలు చేసుకున్నారు. జెట్ ఎయిర్వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఇటువంటి చర్యలు పెద్ద పలితాన్నివ్వలేదు. 

జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం ఎయిర్ ప్రాన్స్ -కేఎల్ఎం, డెల్టా సంస్థల నుంచి పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ రెండు సంస్థలు కూడా జెట్ ఎయిర్వేస్- ఎతిహాద్ భాగస్వామ్యంపై కేంద్రీకరించాయి. మరోవైపు ఇతర మదుపర్లు జెట్ ఎయిర్వేస్ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.