Asianet News Telugu

నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు: త్వరలో మోదీ చేతికి ‘స్విస్’ బ్లాక్‌మనీ డిటైట్స్


ఇప్పటికే భారత ప్రభుత్వానికి 100 మంది నల్ల కుబేరుల జాబితా అందజేసిన స్విస్ సర్కార్ మరో 50 మంది వివరాలు అందజేసేందుకు సిద్ధం అవుతోంది. సాధారణంగా స్విస్ తన బ్యాంకుల్లో ఖాతాల వివరాలు వెల్లడించదు. కానీ మారిన పరిస్థితుల్లో భారత్, స్విస్ పరస్పరం బ్యాంకు ఖాతాల వివరాలు తెలియజేసుకోవాలన్న ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక స్విస్ కూడా నల్ల కుబేరులు సమర్పించిన వివరాలు సరిగ్గా లేకుంటే మాత్రం ఆ జాబితాను మోదీ సర్కార్‌కు అందజేస్తోంది. 

50 Indians named in list of Swiss bank accounts holders, details shared with Modi govt
Author
New Delhi, First Published Jun 17, 2019, 10:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెర్న్‌/న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తామని ఐదేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన ఆచరణ దిశగా ఒక అడుగు ముందుకు పడినట్లు తెలుస్తోంది. కుబేరుల నల్లధనాన్ని మదుపు చేసుకునే వేదిక స్విట్జర్లాండ్‌లోని బ్యాంకులు అని అందరికీ తెలిసిందే. ఆయా బ్యాంకుల్లో 50 మంది భారతీయ ఖాతాదారుల వివరాలను భారత్‌కు అందించే ప్రక్రియను స్విస్‌ అధికారులు చేపట్టారు. 

దీంతో స్విస్ బ్యాంకుల్లో అవినీతి సంపదను దాచుకున్న భారతీయుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నది. భారత్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాల మధ్య కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం.. అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నదిప్పుడు. 

నల్లధనం పోగు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాల నియంత్రణా సంస్థలకు ఈ ఆయా ఖాతాదారుల వివరాలను స్విస్ అధికారులు అందజేయనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు పరస్పరం విధానపరమైన సాయాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియను మొదలు పెట్టారు. 

కాగా ఈ వ్యక్తుల్లో కంపెనీలతో అనుబంధం కల వ్యాపారవేత్తలతోపాటు కొంతమంది డమ్మీలుగా ఉన్నారు. స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్మును దాచుకున్న వ్యక్తుల్లో ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌, ఆర్థిక సర్వీసులు, టెక్నాలజీ, హోమ్‌ డెకరేషన్‌, టెక్స్‌టైల్స్‌, ఇంజనీరింగ్‌ గూడ్స్‌, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, టెలికాం, పెయింట్స్‌ రంగాల వారు ఉన్నారు.
 
అక్రమార్కులు తమ నల్ల ధనాన్ని దాచుకునేందుకు సుదీర్ఘకాలంగా స్వర్గధామంగా ఉన్న స్విట్జర్లాండ్‌ గత కొన్నేళ్లుగా వీరి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. మరోవైపు భారత్‌ కూడా నల్లధన బాబుల వివరాలు చెప్పాలంటూ కోరుతోంది.

2014లో మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్విస్‌ బ్యాంకుల్లో అక్రమంగా సొమ్ము దాచుకున్న వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఆర్థిక నేరగాళ్ల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు స్విస్‌ ప్రభుత్వంతో భారత్‌ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగానే వ్యక్తుల ఖాతాలపై దృష్టి సారించేందుకు స్విస్‌ ప్రభుత్వం ఫెడరల్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగానే గత కొద్ది వారాల్లో 50 మంది వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. 
బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను వెల్లడి చేయాలని, లేనిపక్షంలో భారత ప్రభుత్వంతో ఆ వివరాలను పంచుకుంటామని స్విస్‌ ప్రభుత్వం తెలిపింది. కొద్దిమంది సమర్పించిన డాక్యుమెంట్లు సరిగా లేకపోవటంతో వాటిని తిరస్కరించినట్లు తెలిపింది. గడచిన ఏడాదిగా దాదాపు వంద మంది భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని భారత ప్రభుత్వంతో స్విస్‌ ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకుంది.
 
కాగా స్విస్‌ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో కృష్ణ భగవాన్‌ రామ్‌చంద్‌, పొట్లూరి రాజమోహన్‌ రావు, కల్పేష్‌ హర్షద్‌ కినారీవాలా, కుల్దీప్‌ సింగ్‌ థింగ్రా, భాస్కరన్‌ నళిని, లలితాబెన్‌ చిమన్‌భాయ్‌ పటేల్‌, సంజయ్‌ దాల్మియా, పంకజ్‌ కుమార్‌ సరోగీ, అనిల్‌ భరధ్వాజ్‌, తరణి రేణు టికమ్‌దాస్‌, మహేశ్‌ టికమ్‌దాస్‌ తరణి, సావని విజయ్‌ కనియాల్‌, భాస్కరన్‌ థరూర్‌, కల్పే్‌షభాయ్‌ పటేల్‌ మహేంద్రభాయ్‌, అజయ్‌ కుమార్‌, దినేశ్‌ కుమార్‌ హిమత్‌సింగ్కా, రతన్‌ సింగ్‌ చౌదురి, కథోటియా రాకేశ్‌ కుమార్‌ ఉన్నారు.

మిగిలిన వారి పేర్లు ఎన్‌ఎంఏ,ఎంఎల్‌ఏ, ఎస్‌కేఎన్‌, ఎస్‌బీకే, ఏపీఎస్‌, ఆర్‌ఏఎస్‌, పీఏఎస్‌ వంటి తదితర పేర్లతో ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలోని వ్యక్తులకు చెందిన కంపెనీలు చాలా వరకు కోల్‌కతా, గుజరాత్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబై కేంద్రంగా ఉన్నాయి. అంతే కాదు.. హెచ్‌ఎస్‌బీసీ, పనామా జాబితాల్లోనివారు, ఆదాయం పన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇతర ఏజెన్సీల దర్యాప్తులను ఎదుర్కొంటున్నవారు ఉన్నారు

నిజానికి స్విస్ చట్టాల ప్రకారం విదేశీ ఖాతాదారుల వివరాలను ఎవరికీ వెల్లడించకూడదు. అయితే సమాచార మార్పిడి ఒప్పందం ఉండటంతో ముందుగా ఖాతాల్లోని సొమ్ము ఎక్కడిదో చెప్పాలని, ఆ వివరాలను ఎందుకు బయట పెట్టకూడదో తెలుపాలని ఖాతాదారులకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం నోటీసులను జారీ చేసింది.

ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో 100 మందికిపైగా భారతీయ ఖాతాదారుల వివరాలను స్విస్ ప్రభుత్వం.. మోదీ సర్కారుతో పంచుకున్నది. ఈ నేపథ్యంలో మరో 50 మంది చిట్టా సిద్ధం అవుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios