న్యూఢిల్లీ: ప్రతియేటా బడ్జెట్ ప్రసంగాల్లో ఆర్థిక మంత్రులు పన్ను చెల్లింపుదారులను వేనోళ్లా పొగుడుతూనే ‘పోటు’ ప్రభావం పడకుండా చూసుకుంటారు. పన్ను చెల్లింపులపై వారిని పొగిడే విత్త మంత్రులు టాక్స్ పేయర్స్‌కు లబ్ధి చేకూర్చాలంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తే తప్ప ఒకసారి పన్నుల చెల్లింపులు పెరుగుతాయి. 

ఏ లబ్ధి లేకుండా పన్ను చెల్లించడానికి ఎవరూ ఇష్టపడరు. వీలైనంత మేరకు ఎగవేయడానికి మార్గాలను అన్వేషిస్తారు. ప్రభుత్వం కూడా సెక్షన్‌ 80సీ, డీ వంటి రాయితీలను ప్రకటించినా.. ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం ఇవి ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను ప్రోత్సాహకాలను ప్రకటించి వారిని ఆకర్షించవచ్చు.

పన్ను చెల్లింపు దారులకు ఆదాయం పన్ను చట్టం సెక్షన్‌ 80సీ కింద లభించే లాభాలను పెంచాల్సి ఉంది. దీనికి మరిన్ని పెట్టుబడి అవకాశాలను చేర్చాలి. ఇది పన్ను చెల్లింపును ఆకర్షణీయంగా మారుస్తుంది. ముఖ్యంగా జాతీయ పింఛన్‌ పథకంలో వీలైనంత మంది ఎక్కువగా చేరేలా చూడాలి. ఇది లబ్ధిదారుల భవితకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

ప్రత్యేకించి వార్షికాదాయంపై పన్ను పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదన టాక్స్ పేయర్ల నుంచి వస్తోంది. ప్రస్తుతం రూ. 2.5 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనివల్ల టాక్స్ పేయర్లకు రూ.2,500 అందుబాటులో ఉంటుంది. 2014-15 బడ్జెట్ లోనే అప్పటి విత్త మంత్రి అరుణ్ జైట్లీ ఐటీ మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచేశారు.

వ్యక్తుల్లో పెట్టుబడుల అలవాటును పెంచేలా పన్ను విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది. మఖ్యంగా అమెరికాలో అనుసరించే 401కే విధానం వంటిది పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.

అమెరికాలో 401కే అనేది యజమానే ఉద్యోగికి అందించే పదవీవిరమణ ప్రయోజన పథకం. జీతం చెల్లించడానికి ముందే ఉద్యోగి పేరుతో యజమాని కొంత మొత్తాన్ని పెట్టుబడి పెడతాడు. దీనిపై పన్నులు చెల్లించరు. ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసే సమయంలో పన్నులు చెల్లిస్తారు. 

ఎన్పీఎస్ విత్ డ్రాయల్స్ మీద పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లు దాటిన తర్వాత తాము పొదుపు చేసుకున్న కార్పస్ ఫండ్ విత్ డ్రాయల్స్‌పై 60 శాతం రాయితీని ప్రకటించింది గత డిసెంబర్ నెలలో. ప్రత్యేకించి ఉద్యోగ భవిష్య నిధి నుంచి విత్ డ్రాయల్ చేసే మొత్తంపై పన్ను రాయితీ కల్పించాలని పెన్షనర్లు కోరుతున్నారు. 

ఈక్విటీ నుంచి దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌లో మార్పులలతో పెట్టుబడులను ప్రోత్సహించొచ్చు. ఐదేళ్లు దాటి షేర్లు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే వారికి పన్నులు రాయితీలు వంటివి కల్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా ఉంది. దీంతోపాటు ప్రస్తుతం రూ. లక్ష వరకే ఎల్‌టీసీజీపై మినహాయింపు ఇస్తున్నారు. దీనిని పెంచితే పెట్టుబడులను మరింత ప్రోత్సహించినట్లవుతుంది. 

వైద్యం భవిష్యత్‌లో చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. ప్రజలు అంత మొత్తం వెచ్చించేలా వారికి అవకాశం కల్పించాలి. అందుకే ఆరోగ్యబీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపులను గణనీయంగా పెంచాల్సి ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయిన నేపథ్యంలో ఐటీ చట్టం 80డీ సెక్షన్ కింద ప్రస్తుతం కల్పిస్తున్న రూ.25000 డిడక్షన్‌ను కనీసం రూ.30 వేలకు పెంచాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. టాక్స్ ఫ్రీ బాండ్లను పున: ప్రవేశపెట్టడం వల్ల 10 ఏళ్ల వరకు దీర్ఘ కాలిక మెచ్యూరిటీ గల బాండ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నిర్మాణ రంగం ఆర్థిక వ్యవస్థకు ఎంతో అండగా ఉంటున్నది. దీన్ని నిలబెట్టాలంటే గృహ నిర్మాణాలపై పన్నురాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఇక్కడ సొమ్మును వదులుకొన్నా.. నిర్మాణ సామగ్రి వ్యాపారాలు జోరందుకొని జీఎస్‌టీ రూపంలో పన్ను ఆదాయం పెరిగే అవకాశం ఉంది.