Asianet News TeluguAsianet News Telugu

పొదుపు, పెట్టుబడులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ సేఫ్ రూట్!!

ఆదాయం పొదుపు చేయడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒక సాధనం. ఇందులో మెచ్యూరిటీ తేదీ వచ్చే వరకు నిర్దిష్ట వడ్డీరేటు లభిస్తుంది. 

5 advantages of having a fixed deposit account

హైదరాబాద్: ఆదాయం పొదుపు చేయడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒక సాధనం. ఇందులో మెచ్యూరిటీ తేదీ వచ్చే వరకు నిర్దిష్ట వడ్డీరేటు లభిస్తుంది. నిరంతరం మనమంతా బ్యాంకుల్లో కొనసాగించే సేవింగ్స్ ఖాతా (ఎస్ఎ)తో లభించే వడ్డీరేటు కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు అత్యధిక వడ్డీరేటుతో ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. కనుక ఇతర ఆప్షన్ల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టుబడులకు ప్రాధాన్యతా మార్గంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల వల్ల లభించే కొన్ని ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దామా..!

ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో ఇలా పెట్టుబడి ప్రారంభించండి


ఒకవేళ మీరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడంలో కొత్త అయితే.. తొలుత ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాతో ప్రారంభించండి. మీరు మీకు సమీపంలోని బ్యాంకు శాఖలో నేరుగా సంప్రదించి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. లేదంటే ఇంటివద్ద నుంచే నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ కావచ్చు. నిర్దిష్ట కాలానికి పొదుపు చేయదలిచిన మొత్తం నగదును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. పొదుపు చేయడం ప్రత్యేక అలవాటుగా మారిన మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ మీకు తొలి పెట్టుబడి సాధనంగా నిలుస్తుంది. 

రాబడులకు ఇలా హామీ


ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు మీకు నిర్దిష్ట హామీతో కూడిన రాబడులను ఇస్తాయి. సాధారణంగా పొదుపు బ్యాంకు ఖాతా కంటే ఎక్కువ రాబడులను ఇస్తాయి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలాన్ని బట్టి కూడా రాబడి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు నిర్దిష్ట కాలానికి 7 నుంచి 8 శాతం రాబడి ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లను నిర్దిష్ట గడువు మధ్యలో మాత్రం బ్రేక్ చేయొద్దు. అలా ముందస్తుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్ డ్రా చేస్తే మాత్రం రాబడులపై ప్రభావం పడుతుంది. 

ఖాతాదారుల వెసులుబాటుకు అనుగుణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు


మీరు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మీ వెసులుబాటును బట్టి నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట మొత్తం పొదుపు చేసుకోవచ్చు. కనీసం ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల గడువు వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు నమోదు చేయడానికి వీలవుతుంది. ప్రతి బ్యాంకు కూడా డిపాజిట్లపై సొంత ప్రమాణాలు, నిబంధనలు అమలు చేస్తోంది. కానీ మీరు ఏ బ్యాంకులోనైనా ఖాతాదారు అయినా, కాకున్నా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉన్నది. కనుక మీకు అనువైన, మెరుగైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఎంచుకోవాలి. పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో గడువు పూర్తి కాకముందే విత్ డ్రాయల్స్ చేయగూడదన్న సంగతి విస్మరించొద్దు. 

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో రిస్క్‌లకు నో ఢోకా


పెట్టుబడి మార్గాల్లో కొన్ని అధిక రాబడులను ఇస్తాయి. కానీ సహజంగా వాటి పెట్టుబడుల తీరులో అనిశ్చితి కొనసాగుతుంది. మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్, యూలిప్స్ పథకాలు ఈ కోవలోకే వస్తాయి. ఈ తరహా పెట్టుబడులన్నీ మార్కెట్‌లో లాభనష్టాలకు అనుగుణంగా తలెత్తే రిస్కులను బట్టి రాబడులు లభిస్తాయి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అటువంటి రిస్క్‌లకు చోటు లేదు. మీ జీవితంలో దీర్ఘ కాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా పరిస్థితులను తీర్చిదిద్దడంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెరుగైన పెట్టుబడి పథకాలు. 

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ఇలా చేయూత


కొన్నిసార్లు మీరు చెల్లించాల్సిన అప్పులు కొంత అనిశ్చితిని నెలకొల్పుతాయి. ఒకానొక సమయంటో నగదు అవసరం కావచ్చు. ఇటువంటప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రుణ పరపతి పొందే వెసులుబాటును బ్యాంకులు కలిగిస్తాయి. అయితే ఆయా డిపాజిట్లపై రుణ పరపతి కల్పించడంలో ఆయా బ్యాంకులు నిర్ధిష్టమైన నిబంధనలేమీ అమలు చేయడం లేదు. అయినప్పటికీ అత్యధిక బ్యాంకులు తమ వద్ద ఖాతాదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 60 శాతం నుంచి 90 శాతం వరకు రుణాలు ఇస్తున్నారు. బ్యాంకులు అధికమొత్తంలో ఇచ్చే రుణాలపై ఆయా బ్యాంకులు తమ వద్ద అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా వడ్డీరేట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios