న్యూఢిల్లీ: సగటు వినియోగదారుడికి కేంద్ర ప్రభుత్వం నూతన సంవత్సరంలో మంచి కానుక ఇచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 23 వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీనికి ఆయా వస్తువులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గడమే  కారణం. 

ఇలా 23 వస్తువలపై జీఎస్టీ తగ్గింపు 2018 డిసెంబర్‌ 22వ తేదీన సమావేశమై జీఎస్టీ పాలక మండలి 23 వస్తువులు, సేవలకు పన్నును తగ్గించింది. సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌ బ్యాంకులు, భద్రపరిచిన, శీతలీకరించిన ఆహారం ధరలు దిగి వస్తాయి. సిమెంటు, భారీ తెరలు, ఏసీలు, డిష్‌ వాషర్ల వంటి విలాస వస్తువులను మినహాయించి చాలా వస్తువులను ప్రభుత్వం 28 శాతం నుంచి తక్కువ పన్ను రేట్ల పరిధిలోకి తెచ్చింది.

వివిధ స్థాయిలో తగ్గిన జీఎస్టీ ఇలా..
పుల్లీస్‌, ట్రాన్స్‌మిషన్‌ షాప్టులు, క్రాంక్స్‌, గేర్‌ బాక్సులు, రీట్రేడెడ్‌, వినియోగించిన టైర్లు, లీథియం పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, వీడియో కెమెరాలు, వీడియో గేమ్‌ కన్సోళ్లను 28 శాతం నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. వాహనాలపై థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై పన్నురేటును 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. 

జీఎస్టీ 5% ఉన్న వస్తువులివే..మార్బుల్‌ రబుల్‌, సహజ సిద్ధ కార్క్‌, ఊతకర్ర, ఫ్లైయాష్‌ ఇటుకలపై 5 శాతం జీఎస్టీ విధించారు. సంగీత పుస్తకాలు, కూరగాయాలు (ఆవిరిలో లేదా నీటిలో ఉడికించినవి), శీతలీకరించిన, కంటైనర్లలో నింపిన ఆహారాన్ని జీఎస్టీ నుంచి మినహాయించారు. సాధారణ సేవింగ్స్‌ ఖాతాలు, జన్‌ధన్‌ యోజన ఖాతాలపై సేవలకు జీఎస్టీ లేదు. 

సినిమా టిక్కెట్లపై జీఎస్టీ 12%
రూ.100 వరకు ఉండే సినిమా టికెట్లపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి, రూ.100కు పైగా ఉండే సినిమా టికెట్ల ధరను 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. మానిటర్లు, టీవీ తెరలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది.

16 నెలల కనిష్ఠానికి మౌలికం
దేశ మౌలిక రంగం మందగమనం పాలైంది. నవంబర్ నెలలో 16 నెలల కనిష్ఠ స్థాయి అయిన 3.5 శాతానికి పరిమితమైంది. ముడి చమురు, ఎరువుల ఉత్పత్తి తగ్గడం ఇందుకు కారణమని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు తెలిపాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుదుత్పత్తితో కూడిన 8 మౌలిక రంగాల వృద్ధి 2017 నవంబర్ నెలలో 6.9 శాతంగా నమోదైంది. 

ఇలా ముడి చమురు, ఎరువుల ధరల క్షీణత
2018 నవంబర్ నెలలో ముడి చమురు, ఎరువుల ఉత్పత్తిలో వరుసగా 3.5%, 8.1% చొప్పున క్షీణత నమోదైంది. సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు రంగాల్లో వృద్ధి 0.5%, 2.3%, 6%, 8.8 శాతానికి పరిమితమైంది. 

మెరుగైన విద్యుత్, బొగ్గు వ్రుద్ధి
ఇక పారిశామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది కీలక రంగాల వాటా 41%ఉన్నందున ఆ సూచీపైనా ప్రభావం పడనుంది. అయితే బొగ్గు, విద్యుదుత్పత్తి రంగాల్లో వృద్ధి వరుసగా 3.7%, 5.4 % చొప్పున నమోదైంది. అంతక్రితం ఏడాది నవంబర్ నెలలో నమోదైన 0.7%, 3.9 శాతాలతో పోలిస్తే మెరుగైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.