Asianet News TeluguAsianet News Telugu

ప్రై‘వేట్’ కోసమేనా?: ప్రభుత్వ బ్యాంకులపై ‘సవతి’ ప్రేమ.. ప్రధాన బ్యాంకులకు బాస్‌లు కరువు

ఇప్పటికే ఏడు బ్యాంకుల అధిపతులు రిటైర్మెంట్ కాగా, త్వరలో మరో మూడు బ్యాంకుల అధిపతులు వైదొలుగనున్నారు. కానీ వాటికి సరైన అధిపతులను నియమించే విషయమై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టత కొరవడింది.

10 Public Sector Banks Functioning Without CEO
Author
New Delhi, First Published Aug 10, 2018, 11:19 AM IST

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మనుగడను కాపాడేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చిత్తశుద్ధితో పని చేయడం లేదు. దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండి బాకీలతో పీకల్లోతు కష్టాల్లో సతమతం అవుతున్నాయి. వీటిని అన్ని విధాలా ఆదుకొని నిలబెడుతామని ప్రకటిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ క్షేత్రస్థాయిలో కనీసం ఆయా బ్యాంకులకు బాస్‌లను నియమించడంలో కూడా తమ నిబద్ధతను చూపడం లేదు. 

ఒక వ్యవస్థ, కంపెనీ, బ్యాంకు మరే సంస్థయినా వృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే సారథి పాత్ర ఎంతో కీలకం. కానీ ప్రస్తుతం చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుతం అలాంటి ముఖ్య అధికారులే కరువయ్యారు. ఫలితంగా ఆయా బ్యాంకులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు దిశా నిర్దేశం చేసే వారికోసం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. 

దేశంలోని ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రధాన అధికారులే లేరు. మరో మూడు బ్యాంకుల సీఈవోలు వచ్చే వారంలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో దాదాపు సగం ప్రభుత్వ రంగ (10 బ్యాంకులకు) సారథులే కరువయ్యారు.

బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల్లో ముఖ్య అధికారుల నియామకాలు చేపట్టే 'బ్యాంక్స్‌ బోర్డు బ్యూరో' (బీబీ)బీ పీఎస్‌యూ బ్యాంకులకు సీఈవోలను ప్రతిపాదిస్తూ 14 మంది పేర్లను కేంద్రానికి సమర్పించింది. కానీ ఈ ఉన్నత పదవుల నియామకాలకు ఇప్పటి వరకూ సర్కార్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. పరిస్థితిని ఇలాగే కొనసాగిస్తే పీఎస్బీలు మరింత నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ రంగంలోని పని చేస్తున్న ఏడు బ్యాంకులు బాస్‌లు లేకుండానే పని చేస్తున్నాయి. దీనికి తోడు మరో మూడు బ్యాంకుల అధినేతల గడువు కూడా మరో వారం, పది రోజుల్లో ముగిసిపోనున్నది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ల సీఈవోలు పీఎస్‌ జయకుమార్‌, మెల్వైన్‌ రెగో, కిషోర్‌ కరత్‌ల మూడేండ్ల పదవీ కాలం ఈ నెల మధ్యలో ముగిసిపోనుంది.

రెగో, కరత్‌ల ప్రస్తుత వయస్సు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉండడంతో వారికి పదవి పొడిగింపు లభించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు జయకుమార్‌ వయసు 56గా ఉన్నా ఆయనకు ఎక్స్‌టెన్షన్‌ లభిస్తుందన్న అవకాశాలు అంతంతేనని బ్యాంకింగ్‌ వర్గాలు అంటున్నాయి.

గత నెలాఖరుకు అయిదేండ్ల పదవీ కాలం ముగిసిపోవడంతో సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈవో రాజీవ్‌ రుషీ తన బాధ్యత నుంచి తప్పుకున్నారు. అదే మాదిరిగా కెనరా బ్యాంక్‌ అధినేత రాకేష్‌ శర్మ 60 ఏండ్లకు చేరువవడంతో ఆయన తన బాధ్యతలకు దూరమయ్యారు.

దీనికి తోడు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, అలహాబాద్‌ బ్యాంకుల సీఈవో పదవి గత కొంత కాలంగా వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సంస్థల సీఈవోలు ఆర్‌పీ మరాథే, ఉషా అనంత సుబ్రహ్మణియమ్‌లపై వివిధ ఆరోపణలపై విచారణ సంస్థలు దర్యాప్తు చేస్తున్నందున వీరి ఆధికారాలకు సర్కారు ఇప్పటికే కోత పెట్టింది. 

గత ఏప్రిల్‌ నుంచి ఆంధ్రాబ్యాంక్‌, దేనా బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ల సీఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ బ్యాంక్‌లన్నీ గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలను నమోదు చేసినవే కావడం విశేషం.

ఈ బ్యాంకుల అధినేత పోస్టులకు గాను బీబీబీ 14 మందితో తుది జాబితాను ప్రకటించినప్పటికీ ప్రభుత్వం దానికి ఆమోద ముద్రవేసే విషయంలో తాత్సారం చేస్తూ వస్తోంది. బీబీబీ తయారు చేసిన తుది జాబితాలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌కు చెందిన పద్మజా చంద్రూ, మృత్యుంజయ మహాపాత్రో, పల్లవి మహాపాత్రో, పకరిస్వామి, కరుణం శేఖర్‌, సీవీ నాగేశ్వర్‌లు ఉన్నారు. 

ఈ బ్యాంకులకు ఉన్నతాధికారులను నియమించడం ద్వారా వారు బ్యాంకుల బాధ్యతను తీసుకోవడంతో వాటి ప్రగతికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. కీలకమైన ఈ విషయంలో ప్రభుత్వ తాత్సారం చూస్తుంటే పీఎస్‌బీలను ప్రయివేటీకరించేందుకే సర్కారు ఇలా వ్యవహరిస్తోందేమనన్న అనుమానాలు బలపడుతున్నాయని బ్యాంకింగ్‌ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios