AI: కార్నెగీ ఇండియా నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ సమిట్ – ఇన్నోవేషన్ డైలాగ్ 2025 కార్యక్రమం ఈ ఏడాది ఏఐ అభివృద్ధి భవిష్యత్‌పై కీలక చర్చలకు ప్లాట్ ఫామ్ గా నిలిచింది. ఈ సమావేశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
రచయిత: శ్రుతి మిట్టల్ (అభిప్రాయం)
కార్నెగీ ఇండియా నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ సమిట్ – ఇన్నోవేషన్ డైలాగ్ 2025 కార్యక్రమం ఈ ఏడాది ఏఐ అభివృద్ధి భవిష్యత్‌పై కీలక చర్చలకు కేంద్రంగా నిలిచింది. ఈ సమిట్‌లో భాగంగా నిర్వహించిన ముఖ్యమైన ప్యానెల్ చర్చ పేరు “ది స్పైన్ దాట్ పవర్స్ యూజ్-కేసెస్: కంప్యూట్ అండ్ ఇట్స్ డిస్‌కంటెంట్స్”. ఈ చర్చలో ఏఐ అభివృద్ధికి అవసరమైన కంప్యూటింగ్ మౌలిక వసతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి ప్రభావం గురించి లోతైన విశ్లేషణ జరిగింది. ఆఫ్రికాలో పునరుత్పాదక శక్తితో నడిచే డేటా సెంటర్లు నిర్మించిన అనుభవాలు, ప్రభుత్వాలకు డిజిటల్ మార్పు సలహాలు ఇచ్చిన సందర్భాలు, భారత్‌లో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ అభివృద్ధి వంటి అంశాలు ఈ చర్చకు ఆధారం అయ్యాయి. ఈ ప్యానెల్ చర్చలో మూడు ప్రధాన అంశాలు స్పష్టంగా బయటపడ్డాయి.
కంప్యూట్ స్వావలంబన అవసరం, ఆధారపడితే వచ్చే ప్రమాదాలు
ఇప్పటికే కంప్యూట్ సామర్థ్యం దేశ భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. స్వదేశీ కంప్యూట్ వసతులు లేకపోతే, ఇతర దేశాల టెక్ సంస్థలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రమాదాలకు దారి తీస్తుంది.
ఆఫ్రికాలోని డెవలపర్లు ఇప్పటికే ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. జాతీయ పరీక్షల సమయంలో కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అకస్మాత్తుగా ఆఫ్‌లైన్ కావడంతో వారి ప్రాజెక్టులు పూర్తిగా నిలిచిపోయాయి.
స్టార్టప్‌ల పరిస్థితి ఇంకా తీవ్రమైనది. పెద్ద అంతర్జాతీయ సంస్థలు నిబంధనలు మార్చినప్పుడు లేదా యాక్సెస్ నిలిపివేసినప్పుడు, ఆ స్టార్టప్‌ల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది.
ప్రభుత్వాల ముందున్న అసలు ప్రశ్న క్లౌడ్ వాడాలా వద్దా అన్నది కాదు. క్లౌడ్ వాడకం, స్వదేశీ మౌలిక వసతుల మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్నదే అసలు సవాల్. రక్షణ, గూఢచర్యం, ఆరోగ్య డేటా లాంటి సున్నితమైన సమాచారం పూర్తిగా బయటి సంస్థల చేతుల్లో ఉంచడం ప్రమాదకరం. అదే సమయంలో, కోవిడ్ కాలం లాంటి అసాధారణ పరిస్థితుల్లో అధిక డిమాండ్‌కు క్లౌడ్ సేవలు అవసరం అవుతాయి. అందుకే నిపుణులు సూచించిన పరిష్కారం.. సార్వభౌమ కోర్ మౌలిక వసతులు, ఎడ్జ్ సొల్యూషన్స్, అవసరమైన చోట మాత్రమే క్లౌడ్ వినియోగం కలిపిన బహుస్థాయి వ్యూహం.
ఎక్కువ శక్తి కాదు… తెలివైన ఇంజినీరింగ్ అవసరం
ఈ చర్చలో మరో కీలక అంశం — కంప్యూట్‌ను తెలివిగా ఉపయోగించడం. ప్రతి ఏఐ సమస్యకు భారీ కంప్యూటింగ్ శక్తి అవసరం ఉండదు. ప్రతిసారి అత్యధిక ఖచ్చితత్వం సాధించాల్సిన అవసరం కూడా ఉండదు. ఉదాహరణకు, ప్రజారోగ్య రంగంలో తరచూ వచ్చే ప్రశ్నలను క్యాష్ చేయడం, మొబైల్ ఫోన్లలో పనిచేసేలా మోడళ్లను కుదించడం. ఇలాంటి విధానాలు ఖర్చును తగ్గిస్తాయి. సేవలను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకొస్తాయి.
డిజైన్ నిర్ణయాలు ఇక్కడ చాలా కీలకం. కేవలం 1–2 శాతం ఖచ్చితత్వం పెంచేందుకు భారీ ఖర్చు చేస్తే, ఫలితం పెద్దగా ఉండకపోవచ్చు. ఒక స్క్రీనింగ్ టూల్ 90 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తే, సరైన సమయంలో రిఫరల్ ఇవ్వగలిగితే అది సరిపోతుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే.. సమస్య పరిష్కారానికి సరిపడే స్థాయి కంప్యూట్ ఎంత అవసరమో ముందే నిర్ణయించుకోవాలి. కంప్యూట్ లక్ష్యం కాదు. అది ఒక సాధనం మాత్రమే. తక్కువ వనరులున్న ప్రాంతాల్లో కూడా పనిచేసే వ్యవస్థలను రూపొందించాలి అన్న దిశగా ఆలోచన మారాలి.
ఏఐ మోడళ్లలో దాగి ఉన్న సాంస్కృతిక ప్రభావం
ఈ ప్యానెల్ చర్చలో ప్రస్తావించిన మరో ఆసక్తికర అంశం — ఏఐ మోడళ్లు తటస్థంగా ఉండవు. ఏ సమాజం వాటిని నిర్మిస్తుందో, ఆ సమాజపు విలువలు వాటిలో ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు, పెద్దల పట్ల గౌరవం ఆఫ్రికా సంస్కృతిలో కీలకమైన అంశం. ఇతర ప్రాంతాల్లో ట్రెయిన్ అయిన మోడళ్లలో ఈ విలువ కనిపించకపోవచ్చు.
బయటి దేశాల మోడళ్ల ఆధిపత్యం పెరిగితే, ప్రపంచంలోని సాంస్కృతిక వైవిధ్యం మెల్లగా మసకబారే ప్రమాదం ఉంది. రోజువారీ డిజిటల్ అప్లికేషన్లలో ఇతర దేశాల ప్రాధాన్యం నిశ్శబ్దంగా ప్రవేశించవచ్చు.
ఇక్కడ కీలక ప్రశ్నడిజిటల్ భవిష్యత్‌ను ఎవరి విలువలు ఆకారమిస్తాయి? కంప్యూట్ యాక్సెస్ కొద్ది ప్రాంతాల్లోనే కేంద్రీకృతమైతే, ఆ ప్రాంతాల సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తుంది. భాషలు, స్థానిక ఆచారాలు, సామాజిక నేపథ్యాలను మోడళ్లలో చేర్చినప్పుడే నిజమైన డిజిటల్ స్వావలంబన సాధ్యం. ముందుకు వెళ్లే దారి
ఆచరణాత్మక కార్యాచరణ అవసరం. ఈ చర్చలో వచ్చిన అంశాలు సిద్దాంతాలు మాత్రమే కావు. ఇవి నిజ జీవితంలో ఏఐ ప్రాజెక్టులు స్కేల్ అవుతాయా లేదా పైలట్ దశలోనే ఆగిపోతాయా అన్నదాన్ని నిర్ణయిస్తాయి.
* పాలసీ మేకర్ల ముందున్న బాధ్యత — స్వావలంబనను కాపాడుతూ, అవసరమైన లచకత్వం ఇచ్చే మౌలిక వసతుల్లో పెట్టుబడి పెట్టడం.
* ఇన్నోవేటర్లకు ఉన్న సవాల్ — తక్కువ వనరుల్లో కూడా పనిచేసే డిజైన్‌లతో మోడళ్లను అభివృద్ధి చేయడం.
* సమాజం గుర్తించాల్సిన నిజం —కంప్యూట్ అంటే కేవలం శక్తి కాదు. భవిష్యత్ తరాలకు వెళ్లే విలువల వాహకం కూడా.
రచయిత పరిచయం
శ్రుతి మిట్టల్ కార్నెగీ ఇండియాలో రీసెర్చ్ అనలిస్ట్.
ఆమె పరిశోధన రంగాలు — కృత్రిమ మేథ, సెమీకండక్టర్లు, కంప్యూట్, డేటా గవర్నెన్స్.
గ్లోబల్ సౌత్ దేశాల్లో ఓపెన్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల వచ్చే సామాజిక–ఆర్థిక ప్రయోజనాలపై అధ్యయనం చేయడంలో కూడా ఆమె ఆసక్తి చూపుతున్నారు.


