మార్కెట్లోకి టాటా ‘ఓమెగా ఆర్క్’ హారియర్
ప్రయాణికుల వాహనాల విభాగంలో తనదైన ముద్ర వేయాలని సంకల్పించిన టాటా మోటార్స్ తాజాగా ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో హారియర్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది.
టాటామోటార్స్ సంస్థ ప్రయాణికుల వాహనాలు.. మరీ ప్రత్యేకించి ప్రీమియం వెహికల్స్ విభాగంలో పట్టు సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. ప్రతిష్ఠాత్మకమైన ల్యాండ్‌రోవర్ ఓమెగా ఆర్క్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన హారియర్ ఎస్‌యూవీ మోడల్ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
టాటా మోటార్స్ ఎండీ గుంటెర్ బుట్చేక్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ విభాగం ప్రెసిడెంట్ మయాంక్ ఫరేక్ బుధవారం టాటా హారియర్ మోడల్ కారును ఆవిష్కరించారు. ఈ ఎస్‌యూవీ ధర 12.69 లక్షల నుంచి రూ.16.25 లక్షల వరకు ఉంటుంది. 2018-19లో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగో కారు హారియర్ కావడం విశేషం. ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ అనే వేరియంట్లలో దీనిని విక్రయించనున్నారు.
ఈ కారులో నాలుగు సిలెండర్ల 2.0లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 350 ఎన్‌ఎం టార్క్‌ను 138 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనిలో 6- స్పీడ్ మ్యాన్యూవల్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఇందులో మొత్తం ఎకో, సిటీ, స్పోర్ట్స్ అనే డ్రైవింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 16 అంగుళాల స్టీల్ వీల్స్‌గానీ, 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తోగా లభిస్తుంది. 7 అంగుళాల టీఎఫ్‌టీ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, తొమ్మిది జేబీఎల్ స్పీకర్లు, 8.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి హంగులు ఉన్నాయి.
ఐదు సీట్ల సామర్థ్యం గల ఈ కారును జాగ్వార్ లాండ్ రోవర్ టెక్నాలజీ సాయంతో నిర్మించింది టాటా మోటార్స్. అంతే కాదు ఇది ప్రత్యర్థి సంస్థలు జీప్ కంపాస్, హ్యుండాయ్ క్రెట్టా, మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఎక్స్‌యూవీ 500 మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. ఒక మిడ్‌సైజ్ ప్రీమియం ఎస్ యూవీ హారియర్ ప్రస్తుతానికి డీజిల్ వేరియంట్‌లో మాత్రమే వినియోగదారులకు లభిస్తుంది. భారతదేశ కార్ల విభాగంలో ఎస్ యూవీ సెగ్మెంట్ 27.1 శాతంతో 2.5 మిలియన్ల మార్కెట్ కలిగి ఉన్నది.
టాటా హారియర్ న్యూ మోడల్ కారును న్యూ మాన్యుఫాక్చరింగ్ లైన్‌కు అనుగుణంగా పుణెలో ఉత్పత్తి చేశారు. గతేడాది ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన డిజైన్‌కు అనుగుణంగా హెచ్5ఎక్స్ మోడల్ కారు కాన్సెప్ట్‌తో డిజైన్ చేసిన కారు న్యూ మోడల్ హారియర్. వచ్చే మూడు నెలల కాలానికి ఇప్పటికే విక్రయాలు పూర్తయ్యాయి. తక్షణం వినియోగదారులకు కార్లను పంపిణీ చేస్తామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీక్ తెలిపారు. టాటా హారియర్ తమ సంస్థ విక్రయాల్లో కొత్త చరిత్ర స్రుష్టించేందుకు ప్రారంభ సూచికగా నిలుస్తుందని టాటా మోటార్స్ ఆశలు పెట్టుకున్నది.