Toyota Price Hike: వాహన ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న కార్ల ధరలు..!
కరోనా ప్రభావం, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వలన కార్ల తయారీలో వినియోగించే పరికరాల ధరలు పెరగడంతో వినియోగదారులకు చిక్కులు వచ్చినట్లైంది. మెటీరియల్ ధరలు కూడా పెరిగటంతో కార్ల కంపెనీలు తమ వాహనాలపై ధరలను పెంచుతున్నట్లు చెబుతున్నాయి.
దేశంలో వాహనాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వాటి ధరలకు రెక్కలు మొలవనున్నాయి. ఒక తయారీ కంపెనీ తన కార్లు.. ఇతర వాహనాల ధరలను పెంచితే.. మిగిలినవన్నీ దాన్ని అనుసరించడం ఆటోమొబైల్ సెక్టార్‌లో ఎప్పుడూ ఉండేదే. అదే ట్రెండ్ ఇప్పుడు మళ్లీ కనిపించనుంది. ఏప్రిల్ 1వ తేదీ నాడే దీనికి ముహూర్తం పడింది. కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వాహనాల రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి రోజు నుంచే పెంచిన రేట్లు అమల్లోకి రానున్నాయి.
తమ వాహనాల రేట్లను నాలుగు శాతం మేర పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. అన్ని మోడల్స్ కార్ల రేట్లనూ పెంచినట్లు స్పష్టం చేసింది. నాలుగు శాతం వరకు వాటి రేట్లను సవరించినట్లు వివరించింది. కార్ల తయారీలో వినియోగించే పరికరాలు, విడి భాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇన్‌పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిందని, దాని ప్రభావం వాహనాల తయారీపై పడిందని తెలిపింది.
టయోటా కిర్లోస్కర్ మోటార్స్‌లో లగ్జరీ, హైఎండ్ కార్లు అధికం. ఫార్చూనర్, ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టా, గ్లాంజా, అర్బన్ క్రూయిజర్, యారీస్, సెడాన్.. వంటి పలు రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. సవరించిన ధరలు.. వాటన్నింటికీ వర్తింపజేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదివరకు బీఎండబ్ల్యూ.. తమ కార్ల రేట్లను పెంచునున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కార్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి 3.5 శాతం మేర పెంచనున్నట్లు తెలిపింది. ఆడి, మెర్సిడెజ్ బెంజ్ కూడా ఏప్రిల్ 1 నుంచి రేట్లను పెంచడానికి సన్నాహాలు చేస్తోన్నాయి.
కార్ల తయారీలో వినియోగించే విడి భాగాలు, ఇతర పరికరాల రేట్ల పెరగడం వల్ల తయారీ ఖర్చు భారీగా పెరిగిపోయిందనేది ఆటోమేకర్స్ చెబుతున్నాయి. ఆ ఉద్దేశంతో- కార్లు, ఇతర వాహనాల రేట్లను పెంచబోతున్నట్లు స్పష్టం చేస్తోన్నాయి. కారును తయారు చేయడానికి అవసరమైన స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం, కాపర్, ఇతర విలువైన మెటల్స్ ధరలు భారీగా పెరిగాయని, ఆ భారాన్ని తాము మోయలేకపోతున్నాంటూ కార్ మేకర్స్ ముందు నుంచీ స్పష్టం చేస్తోన్నాయి.