టాటా మోటార్స్ సరికొత్త రికార్డ్... ఆ మోడల్ కార్ల విక్రయాల వల్లే.....
టాటా మోటార్స్ చరిత్రలో టాటా టియాగో సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత 28 నెలల్లో అత్యధికంగా 1.7 లక్షలకు పైగా కార్లను విక్రయించడంతో టాటా మోటార్స్ మేనేజ్ మెంట్‌లో కొత్త జోష్ వచ్చి పడింది. టాటా మోటార్స్ మేనేజ్ మెంట్ కు టాటా టియాగో ‘ఒక పాఠశాల’ మాదిరిగా గైడ్‌గా వ్యవహరిస్తోంది.
న్యూఢిల్లీ: ప్రయాణికుల, వ్యక్తిగత వాహనాల తయారీలో పేరొందిన ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2016లో మార్కెట్‌లోకి విడుదల చేసిన ‘టాటా టియాగో’ కారు సేల్స్ రికార్డు స్థాయిలో 1.7 లక్షలు దాటాయి. అదీ కూడా 28 నెలల గడువులోపే. అందునా ఈ కారు కొనుగోలు దారుల సగటు వయస్సు 35 ఏళ్లలోపే కావడం మరో ఆసక్తికర పరిణామం అని టాటా టియాగో ఎన్నార్జీ మోడల్ కారు ఆవిష్కరణ సందర్భంగా సంస్థ ప్రయాణ వాహనాల విక్రయాల విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీఖ్ తెలిపారు.
2016లో తొలిసారి టాటా టియోగో మోడల్ కారును విపణి వీధిలోకి విడుదల చేసిన టాటా మోటార్స్ తన ఉత్పత్తుల తయారీ వ్యూహాన్ని సమూలంగా మార్చేసింది. వాహనాల విక్రయమే లక్షంగా లిటిల్ హేచ్ బ్యాక్ మార్పులతో టాటా టియాగో డిజైన్‌ను రూపొందించింది. తద్వారా మారుతి సుజుకి ఆల్టో, రెనాల్ట్ క్విడ్, హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 మోడల్ కార్ల మాదిరిగా టాటా టియాగోను తీర్చిదిద్దింది టాటా మోటార్స్.
ప్రయాణికుల వాహనాలను తయారు చేయడంలో టాటా మోటార్స్ మేనేజ్మెంట్ సమూల మార్పులను తీసుకొచ్చింది. యువకులను ఆకర్షించేందుకు వీలుగా మార్పులు చేసింది. టాటా టియాగో తెచ్చి పెట్టిన విజయంతో నూతనంగా మార్కెట్‌లోకి విడుదల చేసిన టాటా హెక్సా, టైగొర్.. ఇటీవల ఉత్పత్తి చేసిన ఎస్ యూవీ సబ్ కంపాక్ట్ నెక్సాన్ మోడల్ కార్లలోనూ టాటా మోటార్స్ అదే ఫార్ములాను పాటిస్తోంది.
టాటా మోటార్స్ ప్రయాణ వాహనాల విక్రయాల విభాగం అధ్యక్షుడు మయాంక్ పరీఖ్ మాట్లాడుతూ టాటా టియాగో కొనుగోలు దారుల్లో 50 శాతానికి పైగా 35 ఏళ్ల లోపు వారేనన్నారు. టాటా టియాగో తమకు స్కూల్ వంటిదని మయాంక్ పరీఖ్ తెలిపారు. తమ కార్ల కొనుగోలుదారుల ఆకాంక్షలను తెలుసుకునేందుకు టాటా టియాగో తమకు పాఠాలు నేర్పిందన్నారు. గతంలో తమ వద్దకు ఈ కస్టమర్లంతా రాలేదని, తొలిసారి వచ్చారని తమ డీలర్లు తెలిపారన్నారు.
టాటా టియాగో తమ మార్కెట్‌లో 80 శాతం విక్రయాల వాటా కలిగి ఉన్నదని మయాంక్ పరీక్ తెలిపారు. టాటా టియాగో, దాని సెడాన్ వర్షన్ ‘టైగోర్’కార్లను టాటా మోటార్స్‌కు చెందిన సనంద్ ప్లాంట్ 4.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తోంది. గుజరాత్ రాష్ట్రం సనంద్ జిల్లాలో గల ఈ యూనిట్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నది.
ఇదే ప్లాంట్‌లో 2010లో నానో కారును ఉత్పత్తి చేసింది. వచ్చేనెలాఖరు నాటికి ఐదు లక్షల కార్ల ఉత్పత్తి మైలురాయిని దాటనున్నది. ప్రతి నెలా టాటా టియాగో, దాని సెడాన్ వర్షన్ మోడల్ కార్లు 8000 యూనిట్లు అమ్ముడుపోతున్నాయి. టాటా టియాగో ఎన్నార్జీ మోడల్ కారు రంగ ప్రవేశంతో టాటా టియాగో విక్రయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నది.
టాటా టియాగో మోడల్ కారుకు మూడు సిలిండర్ల ఇంజిన్లు ఉన్నాయి. 1.2 లీటర్ల రివొట్రోన్, 1.0 టీ - లీటర్ రెవొటోర్క్ డీజిల్ వేరియంట్ ఇంజిన్ కలిగి ఉంది. అంతేకాదు 5 - స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. టాటా టియాగో, ఎఎంటీ వర్షన్ మోడల్ కూడా మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. తాజాగా టాటా టియాగో ఎన్నార్జీ అదనపు బాడీ క్లాడింగ్, న్యూ అల్లాయ్ వీల్స్, నూతన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా చేర్చారు.