Asianet News TeluguAsianet News Telugu

బీఎస్-6 ఎఫెక్ట్: 2020 నుంచి రతన్ కలల `నానో’కు టాటా!

మధ్య తరగతి ప్రయాణికుల కారుగా.. లక్ష రూపాయల కారుగా రతన్ టాటా కలల ప్రాజెక్టుగా పేరొందిన `నానో’కు టాటా మోటార్స్ టాటా చెప్పనున్నది. దీనికి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ -6 ప్రమాణాలు అమలులోకి రావడమే ప్రధాన కారణం. 
 

Tata Motors to bid adieu to Nano from April 2020
Author
Hyderabad, First Published Jan 25, 2019, 3:01 PM IST

లక్ష రూపాయల కారుగా పేరొందిన రతన్ టాటా కలల కారు టాటా మోటార్స్   ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి నానో కారు ప్రస్థానానికి  త్వరలో ఫుల్ స్టాప్ పడనున్నది. వాహనాల భద్రత కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న భద్రత, కాలుష్య నియంత్రణపై బీఎస్ -6 ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంటుంది. 

బీఎస్ - 6 నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించలేమని టాటా మోటార్స్ గురువారం సంకేతాలను ఇచ్చింది. 2020 ఏప్రిల్ నాటికి ఈ కారు తయారీని పూర్తిగా నిలిపేయనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ పరోక్షంగా ప్రకటించారు.

బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా నానోను తీర్చిదిద్దడానికి తాము మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేమని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీఖ్ చెప్పారు. నానోతోపాటు మరికొన్ని టాటా ప్యాసెంజర్ వెహికిల్స్ తయారీని కూడా నిలిపేయాలని భావిస్తున్నట్లు పరీఖ్ చెప్పారు.

దేశంలోని మధ్య తరగతి ప్రజలకోసం, ఎంట్రీ లెవల్ కారుగా బడ్జెట్ ధరలో లాంచ్ చేసిన నానో కారు అమ్మకాలు, ఉత్పత్తికి  నిలిపివేయనున్నామని మయాంక్ చెప్పారు. `ఈ కారును గుజరాత్ రాష్ట్రం సనద్ ప్లాంట్లో తయారు చేస్తున్నాం. జనవరిలో కొత్తగా కొన్ని భద్రతా నిబంధనలు వచ్చాయి, ఏప్రిల్లో మరికొన్ని రానున్నాయి. అలాగే అక్టోబర్లో మరికొన్ని..ఇలా 2020 ఏప్రిల్ నాటికి బీఎస్-6 ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నానో  కార్ల ఉత్పత్తిని కొనసాగించలేం` అని మయాంక్ పరీఖ్ పేర్కొన్నారు. 

ఇప్పటికే విక్రయాలు  దారుణంగా పడిపోయిన నానో కారు ఆవిర్భావం 2009లో జరిగింది. రూ.లక్ష ధరతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినా వినియోగదారులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో దాదాపు పదేళ్లలోనే ఈ కారు కథ  కంచికి చేరనున్నది. మరోవైపు రతన్ టాటా కలల ప్రాజెక్టు  ‘నానో’ కారు మూలంగా పైసా లాభం రాకపోగా, కంపెనీకి గుదిబండగా మారిందని, రూ. 1000 కోట్ల వరకు నష్టపోయామని టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios