Asianet News TeluguAsianet News Telugu

టాటా మోటార్స్‌కు ‘జాగ్వార్’ సెగ...భారీగా షేర్లు డౌన్

టాటా మోటార్స్ అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు భారీగా నిధులు కేటాయించాల్సి రావడంతో భారీగానే మూల్యం చెల్లించుకున్నది. వాహనాల కొనుగోళ్ల డిమాండ్ తగ్గడం వల్ల కూడా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం ఫలితాల్లో టాటామోటార్స్ నష్టాలను ప్రకటించడం ఇన్వెస్టర్లకు నచ్చలేదు. 

Tata Motors share price tanks to fresh 52-week low over Q3 net loss, cut in profit margin outlook
Author
New Delhi, First Published Feb 8, 2019, 11:37 AM IST

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడంతో ఆ సంస్థ షేర్లు శుక్రవారం కుప్పకూలాయి. మార్కెట్‌ ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన షేర్లు.. కాసేపటికే భారీగా పతనమయ్యాయి. ఒక దశలో 20శాతానికి పైగా నష్టపోయాయి.

క్రితం సెషన్‌లో బీఎస్‌ఈలో రూ. 182.90 వద్ద ముగిసిన షేర్ విలువ నేటి ట్రేడింగ్‌లో రూ. 164.65 వద్ద మొదలైన కాసేపటికే 23శాతం నష్టపోయి రూ. 141.90కి పడి పోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే సాగుతున్నాయి.

ఉదయం 10 గంటల ప్రాంతంలో టాటా మోటార్స్‌ షేరు విలువ బీఎస్‌ఈలో 15.17శాతం నష్టంతో రూ. 155.15 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 15.07శాతం నష్టపోయి రూ. 155.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

గురువారం టాటా మోటార్స్ మూడో త్రైమాసికంలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. దీంతో టాటా మోటార్స్ సంస్థకు రూ.26, 960.8 కోట్ల నష్టం వచ్చింది. బ్రిటన్‌కు చెందిన తన అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు ఒకేసారి భారీగా నిధులను కేటాయించడం వల్లే లాభాల్లో గండిపడిందని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 

2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సంస్థ రూ.1,214.6 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. మూడు త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.36 శాతం ఎగబాకి రూ.77,582.71 కోట్లకు చేరుకోవడం విశేషం.

గతేడాది ఇది రూ.74,337 .70 కోట్లుగా ఉన్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. పన్నులు చెల్లించాక నికర లాభం రూ.211.59 కోట్ల నుంచి రూ.617.62 కోట్లకు చేరుకోగా, ఆదాయం రూ.16,186.15 కోట్ల నుంచి రూ.16,477.07 కోట్లకు ఎగబాకింది.

జేఎల్‌ఆర్ కంపెనీ ఆదాయం మాత్రం ఒక్క శాతం తగ్గి 6.2 బిలియన్ పౌండ్లకు జారుకున్నది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన దానికంటే జేఎల్‌ఆర్ విలువ పడిపోయినందనుకు దీనిని పూడ్చుకోవడానికి 3.1 బిలియన్ పౌండ్లు (రూ. 27,838 కోట్లు) నిధులను ఒకేసారి వెచ్చించడంతో టాటా మోటర్స్ లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది.

వీటితోపాటు వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం, నిర్వహణ ఖర్చులు పెరుగడం కూడా ప్రభావాన్ని మరింత పెంచాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశీయ వ్యాపారం మరింత బలోపేతమైందని, అటు మార్కెట్‌వాటాలోనూ, లాభాల్లోనూ వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

టాటా మోటార్స్ సంస్థను నవీకరించాలనే ఉద్దేశంతో రూపొందించిన 2.0 వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు, దీంట్లోభాగంగా నూతన వాహనాలను విడుదల చేయడం, నిలకడైన వృద్ధిని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు. కానీ, జేఎల్‌ఆర్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదన్నారు. మూడో త్రైమాసికంలో జేఎల్‌ఆర్ రిటైల్ విక్రయాలు 6.4 శాతం తగ్గి 1,44,602 యూనిట్లకు పడిపోయాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios