రోవర్ సేల్స్‌లో రికార్డు.. జీఎస్టీ తగ్గింపునకు టీవీఎస్ డిమాండ్

దేశీయంగా ఆటోమొబైల్ ప్రత్యేకించి కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టినా.. టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సేల్స్ 16.23 శాతం పెరిగాయి. ఇక మోటారు సైకిళ్లు, స్కూటర్ల కొనుగోలుపై విలాసవంతమైన 28 శాతం శ్లాబ్ కు బదులు 18 శాతం విధించాలన్న హీరో మోటో కార్ప్స్, బజాజ్ ఆటోమోబైల్ సంస్థల డిమాండ్‌కు టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మద్దతు పలికారు. 

Tata Motors-Owned Jaguar Land Rover 2018 Sales in India up 16.23 Percent

టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గతేడాది భారత్‌లో 4,596 వాహనాలు విక్రయించింది. 2017లో విక్రయించిన 3,954 కార్లతో పోలిస్తే ఇవి 16.23 శాతం అధికం. కంపెనీ ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక విక్రయాలు ఇవే కావడం విశేషం. 

జాగ్వార్ సేల్స్ దన్ను ఈ మోడల్ కార్లే
జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాల్లో రికార్డు నెలకొల్పేందుకు ఆ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసిన ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్‌, రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌, జాగ్వార్‌ ఎఫ్‌-పేస్‌, ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌ మోడళ్లు దన్నుగా నిలిచాయి.

2018లో జాగ్వార్ లాండ్ రోవర్ 10 నూతన మోడల్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వాటిలో రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం గల రేంజ్ రోవర్ వేలర్, 2018 రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, జాగ్వార్ ఎఫ్-ఫేస్ మోడల్ కార్లు ఉన్నాయి.

2018లో వాహన పరిశ్రమ సవాళ్లు అనేకం
‘2018లో వాహన పరిశ్రమ పలు అవరోధాలు ఎదుర్కొన్నది. ముఖ్యంగా ద్వితీయార్థంలో నగదు లభ్యత సమస్యలు ముందుకు వచ్చాయి బీమా ఖర్చులు, వడ్డీ రేట్లు పెరగడం భారంగా మారింది. అయినా జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ అమ్మకాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. 2019లో కొత్త కార్ల విడుదల, వినియోగదారుల సేవలు మెరుగుదలపై దృష్టి పెట్టనున్నాం’ అని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి పేర్కొన్నారు.

బైక్‌లపై జీఎస్టీని 18%కి తగ్గించాల్సిందే
క్రమంగా ద్విచక్ర వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. అత్యధికులకు కనీస అవసరంగా మారిన  ద్విచక్ర వాహనాలపై జీఎస్‌టీని 18 శాతానికి తగ్గిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని గత వారం హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌, బజాజ్ ఆటోమొబైల్ అధినేత రాహుల్ బజాజ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం  జీఎస్టీ విధిస్తున్నారు. 

ప్రజల ప్రాథమిక అవసరం బైక్ అన్న టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్
ఎక్కువ మంది ప్రజలకు ద్విచక్రవాహనం ప్రాథమిక అవసరంగామారినందున, వీటిపై విధించే జీఎస్‌టీ రేట్లను పునఃసమీక్షించాలని టీవీఎస్‌ మోటార్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ కోరారు. పట్టణీకరణ అధికమవ్వడం, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, చిన్న పట్టణాల మధ్య అనుసంధానత ఏర్పడటం వల్ల ద్విచక్ర వాహనం ప్రతి ఒక్కరికి ప్రాథమిక అవసరంగా మారిందన్నారు.

ఇలా బైక్ లు, స్కూటర్లపై 28% శ్లాబ్ జీఎస్టీ సరికాదు
ప్రజల కనీస వస్తువుగా మారిన బైక్‌లు, స్కూటర్లపై విలాసవంత వస్తువులకు విధిస్తున్న 28 శాతం పన్ను శ్లాబ్ అమలు చేయడం  సరైన నిర్ణయం కాదని టీవీఎస్‌ మోటార్‌ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ అన్నారు. కొత్త భద్రతా ప్రమాణాలు, బీఎస్‌6 ఉద్గార నిబంధనలు అమలైతే ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు జీఎస్టీ రేటు కూడా ఎక్కువగా ఉంటే అది కొనుగోలుదారుపై భారం పెరుగుతుందని అన్నారు. 

ఏటా రోడ్లపైకి కోటికి పైగా కొత్త వెహికల్స్
ప్రతి ఏటా కోటికి పైగా వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) పేర్కొంది. 2017లో దేశవ్యాప్తంగా 1.20 కోట్ల కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాగా, 2018లో 1.30 కోట్ల వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయని ఫాడా గణాంకాలు పేర్కొన్నాయి.

గణనీయంగా తగ్గిన కార్ల కొనుగోళ్లు
ద్విచక్ర వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా కార్ల కొనుగోళ్లు మాత్రం తగ్గుతూ వస్తున్నాయని ఫాడా తెలిపింది. 2017తో పోల్చితే 2018లో ద్విచక్ర వాహనాల కొనుగోలు ఐదు శాతం పెరగగా కార్ల విక్రయాలు రెండు శాతం తగ్గాయని పేర్కొంది.

నవంబర్ నెలలో అత్యధికంగా వాహనాల విక్రయాలు
గత ఏడాది నవంబర్ నెలలో అత్యధికంగా 17.7 లక్షల వాహనాలు రిజిస్టర్‌ అయ్యాయని ఫాడా తెలిపింది. రిజిస్టరైన వాటిల్లో బైక్‌ల సంఖ్య 13.83 లక్షలుగా ఉండటం గమనార్హం. డిసెంబర్ నెలలో కొత్తగా 14.42 లక్షల వాహనాలు రహదారుల పైకి వచ్చినట్లు తెలిపింది. గత మూడు నెలల్లో ఇంధన ధరలు తగ్గడంతోనే వాహనాల కొనుగోళ్లు పెరిగాయని ఫాడా తెలిపింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios