న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం.. టాటా మోటార్స్ ‘హ్యాచ్ బ్యాక్ (చిన్నకారు)’ విభాగంలో మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో టియాగోను విపణిలోకి విడుదల చేసినట్లు తెలిపింది. ఈ కారు ధర రూ.4.4 లక్షల నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించింది.

టియాగో అన్ని మోడల్ కార్లలో ముందు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ), పార్కింగ్‌ కోసం వెనుకవైపు సెన్సర్లు, కార్నర్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, రేర్ పార్కింగ్ సెన్సర్లు తదితర వసతులు కొత్త కారులో పొందుపరిచినట్లు టాటా మోటార్స్ వివరించింది. 

మితిమీరిన వేగంతో వెళ్లినా, డ్రైవర్‌ లేదా ప్రయాణికులు సీట్‌బెల్ట్‌ పెట్టుకోకున్నా హెచ్చరికలు కూడా వస్తాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగో రేంజ్ కార్లన్నీ సీట్ బెల్టులు, ప్రెటెన్షనర్లు, లోడ్ లిమిటర్స్ వంటి ఫీచర్లతో నిండిపోయాయి. 

భారతదేశ వినియోగదారులకు స్టాండర్డ్ సేఫ్టీ అప్ గ్రేడెడ్ వెహికల్స్ అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ సేల్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ బర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్, ఫాలోమీ హోమ్ ల్యాంప్స్, పార్క్ అసిస్ట్ విత్ రేర్ సెన్సర్స్ అండ్ డిస్ ప్లే, డే అండ్ నైట్ ఐఆర్వీఎం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రేర్ డిపొగ్గర్, రేర్ స్మార్ట్ వైఫర్ విత్ వాషర్ తదితర ఫీచర్లు చేర్చారు. వీటితోపాటు రేంజ్ టాపింగ్ ఎక్స్ జడ్ ప్లస్ ట్రిమ్ కారులో ఆపిల్ కార్ ప్లే, లార్జర్ 7-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలిగి ఉన్నాయి. 

టియాగో కోసం టాటా మోటార్స్ మిడ్ లైఫ్ స్టైల్ ఫేస్ లిఫ్ట్ డిజైన్లను అభివ్రుద్ధి చేసింది. ఈ డిజైన్ టాటా ఆల్ట్రోజ్ మోడల్ కారును తలపిస్తుంది. టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ మోడల్ కారు మాత్రమే. 1.2 లీటర్ల రివొట్రోన్ మోటర్, 6000 ఆర్పీఎం వద్ద 84 బీహెచ్పీ, 3500 ఆర్పీఎం వద్ద 114 ఎన్ఎం పీక్ టార్చ్ సామర్థ్యం టాటా టియాగో మోడల్ కార్ల సొంతం.