ఇది కార్ల సంస్థలకు సవాల్: టాటా హారియర్ బుకింగ్స్ నేటి నుంచే
రెనాల్డ్, హ్యుండాయ్, నిస్సాన్ తదితర సంస్థలకు టాటా మోటార్స్ సవాల్ విసిరేందుకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది మార్కెట్లో అడుగు పెట్టనున్న టాటా హారియర్ ఎస్‌యూవీ కారు బెస్ట్ మోడల్ గా అందరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
దేశీయంగా అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లోనే ముందుకు సాగుతూ వచ్చింది. ఇటీవలి కాలంలో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇతర ఆటోమొబైల్ సంస్థలు దూకుడుగా దూసుకెళ్తున్నాయి.
సేవా ద్రుక్పథంతో పని చేస్తున్న టాటా సన్స్ అనుబంధ టాటా మోటార్స్ అదే బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మార్కెట్లోకి ప్రవేశించనున్న టాటా హారియర్ ఇతర ఆటో సంస్థలకు సరికొత్త సవాల్ విసిరేందుకు సంసిద్ధమవుతోంది.
నేటి నుంచి టాటా హారియర్ బుకింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఒకసారి మార్కెట్లోకి రంగ ప్రవేశం చేశాక టాటా హరియర్ తన ప్రత్యర్థి సంస్థలు హ్యుండాయ్ క్రెటా, రెనాల్డ్ కాప్చర్, త్వరలో బయటకు రానున్న నిస్సాన్ కిక్స్ మోడల్ ఎస్ యూవీ మోడల్ కు గట్టి పోటీనిస్తోందన్న విశ్వాసం టాటా మోటార్స్ కనబరుస్తోంది.
దేశీయంగా ఒక్కో అడుగు ముందుకేస్తూ వెళుతున్న టాటా మోటార్స్ నూతన మోడల్ ఎస్ యూవీ కారు హారియర్ ఆవిష్కరణ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డీజిల్ ఆటోమోటివ్ వర్షన్‌తో మార్కెట్లో అడుగు పెట్టనున్న టాటా హారియర్.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్లస్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో పుష్ బటన్ స్టార్ట్‌తో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది.
హ్యుండాయ్ డీజిల్ ఆటోమేటిక్ వారియంట్ మాదిరిగా టాటా హారియర్‌లోనూ టార్చ్ కన్వర్టర్ కస్టమర్లకు లభించనున్నది. ఫియట్‌లో మాదిరిగా నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్.. నూతనంగా డిజైన్ చేసిన రెండు లీటర్ల సామర్థ్యం గల క్రొయోటెక్ ఇంజిన్ హారియర్ ఎస్‍యూవీలో సిద్ధంగా ఉంది. 140 హెచ్పీ సామర్థ్యం గల పవర్ ఔట్ పుట్ కూడా హారియర్‌లో అదనపు ఆకర్షణ కానున్నది.
టాటామోటార్స్ తన అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్‌తో కలిసి హారియర్ కారు అభివ్రుద్ధి చేసింది. అధునాతన మొనొకోక్యూ ఒమెగార్గ్ (ఆప్టికల్ మాడ్యులర్ ఎఫిసియెంట్ గ్లోబల్) ఆర్కిటెక్చర్ ఆధారంగా హారియర్ కారు తయారైంది.
సోమవారం నుంచి టాటా మోటార్స్ డీలర్లు హారియర్ మోడల్ ఎస్ యూవీ కార్ల బుకింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో టాటా హారియర్ మోడల్ కారు మార్కెట్లోకి వస్తే అది ఈ నెల 18న మార్కెట్లో అడుగిడనున్న నిస్సాన్ కిక్స్ మోడల్ కారుతోపాటు హ్యుండాయ్ క్రెటా, రెనాల్డ్ కాప్చర్ తదితర మోడల్ కార్లకు గట్టి పోటీ కానున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.