స్కోడా ఆటో ఇండియా కార్పొరేట్‌ ఎడిషన్‌ ప్రీమియర్ ఎడిషన్ కొత్తగా ఆక్టేవియా మోడల్ కారును విపణిలోకి తీసుకొచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో ఈ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కారు కేవలం క్యాండీ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. ఈ కార్ల ధరల రూ.15.49-16.99 లక్షల మధ్య ఉంటాయి. 

1.4 టీఎస్‌ఐ (ఎంటీ) పెట్రోల్‌ ఇంజిన్‌తో తయారైన కారు ధర రూ.15.49 లక్షలు కాగా, 2.0 టీడీఐ (ఎంటీ) డీజిల్‌ ఇంజిన్‌తో తయారైన కారు ధర రూ.16.99 లక్షలు. పెట్రోలు కారు లీటరుకు 16.7 కి.మీల మైలేజీ, డీజిల్‌ కారు 21 కి.మీ.ల మైలేజీ ఇస్తాయని కంపెనీ పేర్కొంది. 

పెట్రోల్‌ కారు 8.1 సెకన్లలో, డీజిల్‌ కారు 8.4 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటాయని, పెట్రోల్‌ కారు గరిష్ఠంగా గంటకు 219 కి.మీ, డీజిల్‌ కారు గరిష్ఠంగా గంటకు 218 కి.మీ వేగంతో దూసుకెళ్తాయని తెలిపింది.

పెట్రోల్ ఇంజిన్ కారు 150 పీఎస్, 250 ఎన్ఎం టార్చి, టర్బో చార్జ్‌డ్ డీజిల్ కారు 143 పీఎస్, 320 ఎన్ఎం టార్చిని కలిగి ఉంటాయి. రెండు వేరియంట్ల కార్లు సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటాయి. ఈ మోడల్ కారు ఫ్యూయల్ ఎఫిసియెన్సీగా ఉంటుందని స్కోడా ప్రకటించింది.  

ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు ఖ్వాడ్రా హెడ్ ల్యాంప్స్, 16 అంగుళాల వెలోరం అల్లాయ్ వీల్స్, షార్ప్‌లీ కట్ టొర్నడో లైన్స్‌తో డైనమిక్‌గా కనిపిస్తుంది. ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ), హైడ్రాలిక్ బ్రేక్ అసిస్టెంట్ (హెచ్ బీఏ), యాంటీ స్లిప్ రెగ్యులేషన్ (ఎఎస్సార్), మోటార్ స్పీడ్ రెగ్యులేషన్ (ఎంఎస్ఆర్), ఎలక్ట్రానిక్‌ డిఫరెన్షియల్ లాక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) తదితర ఫీచర్లు లభిస్తాయి. 

ఆరేళ్ల వారంటీ ఉన్న ఈ కారుపై అదనంగా మరో రెండేళ్లు వారంటీ కొనసాగుతుందని స్కోడా ప్రకటించింది. 16.51 సెం.మీ. టచ్ స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మిర్రర్ లింక్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో తదితర ఫీచర్లు కూడా చేర్చారు. టూ జోన్ క్లైమాట్రోనిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ కూడా ఉంది. స్కోడా ఆక్టేవియా కార్పొరేట్ ఎడిషన్ గా వచ్చిన ఈ కారు కంపెనీ ‘షీల్డ్ ప్లస్’ ఇన్షియేటివ్‌లో భాగంగా మార్కెట్లోకి విడుదల చేసింది.