పారిస్: రెండు అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు విలీనం కాబోతున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు ఈ సంగతే ధ్రువీకరిస్తున్నాయి. ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్, ఇటలీ - అమెరికా ఆటో మేజర్ ఫియట్ క్రిసలర్ మధ్య విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయని ఆ వర్గాల కథనం. 

సోమవారం ప్యారిస్‌లోని స్టాక్ మార్కెట్ల ప్రారంభానికి ముందే రెండు సంస్థల మధ్య చర్చల ప్రక్రియ సంగతి ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే రెండు సంస్థల ప్రతినిధులు విలీనంపై చర్చలు ప్రారంభించారు. త్వరలో అవి కొలిక్కి రానున్నాయని తెలుస్తోంది.

సోమవారం ఉదయం రెనాల్ట్ బోర్డు సమావేశం కానున్నది. ఈ సమావేశం కోసం ఫియల్ క్రిస్లర్ మేనేజ్మెంట్ ఒక నివేదిక సిద్ధం చేసింది. దీని ప్రకారం ఏటా ప్రపంచంలోని అన్ని రీజియన్లలో 87 లక్షల కార్లను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఖర్చులలో పొదుపు ద్వారా 560 కోట్ల డాలర్లు ఆదా అవుతుందని అంచనా. 

ప్రతిపాదిత ఎస్సీఏ - రెనాల్ట్ టైఅప్ విజయవంతమైతే తదుపరి దశలో ప్రత్యర్థి సంస్థలు జనరల్ మోటార్స్, పీగోట్ మేకర్స్ ‘పీఎస్ఎ గ్రూప్’ వరకు అన్ని సంస్థలతో పోటీ పడేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఎఫ్సీఏ- రెనాల్ట్ జాయింట్ వెంచర్ సంస్థకు చైర్మన్‌గా జాన్ ఎల్కాన్ ఉంటారు. ఆయన సారథ్యంలోని అగ్నేల్లి కుటుంబానికి ఎఫ్సీఏలో 29 శాతం వాటా ఉంటుంది. 

ఇక రెనాల్ట్ చైర్మన్ జీన్ డొమినిక్యు సెనార్డ్ నూతన సంస్థ సీఈఓగా వ్యవహరిస్తారని సమాచారం. జాయింట్ వెంచర్‌లో ఏర్పాటయ్యే ఈ సంస్థలో జపాన్ ఆటో మేజర్ నిస్సాన్ సంస్థకు 15 శాతం, రెనాల్ట్ సంస్థకు 43 శాతం వాటా ఉన్నది. రెనాల్ట్ -ఎఫ్ సీఏ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని, వచ్చేవారం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్నదని ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది. 

ఫైనాన్సియల్ టైమ్స్ కథనంపై స్పందించడానికి రెనాల్ట్, ఫియట్ కంపెనీల అధికారుల ప్రతినిధులు నిరాకరించారు. ఒకవేళ ఒప్పందం నిజమైతే రెనాల్ట్ -నిస్సాన్ -మిత్సుబిషి ఒప్పందం పరిధిలోకి ఫియట్ -క్రిస్్లర్ చేరిపోనున్నాయి. దీంతో ప్రపంచంలోనే కార్ల ఉత్పత్తిలోనే అతిపెద్ద సంస్థగా అవతరిస్తుంది. ఏటా 1.6 కార్లను ఉత్పత్తి చేయనున్నది. ప్రస్తుతం రెనాల్ట్ - నిస్సాన్ -మిత్సుబిషి సంయుక్తంగా 1.08 కోట్ల కార్లు ఉత్పత్తి చేస్తొంది.