మిలాన్/ పారిస్: ఫ్రాన్స్ ఫ్యూజియో, సిట్రాన్ కార్ల తయారీ గ్రూప్ సంస్థ ‘పీఎస్ఏ’ను విలీనం చేసుకునే దిశగా అమెరికా-ఇటలీ ఆటోమొబైల్ మేజర్ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ (ఎఫ్సీఏ) భావిస్తున్నది. ఈ మేరకు పీఎస్ఎ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బుధవారం తెలిపింది. 

దీన్ని పీఎస్ఏ కూడా ధ్రువీకరించినా అదనపు సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ ఫియల్ క్లిస్టర్ ఆటోమొబైల్ (ఎఫ్సీఏ)లో పీఎస్ఏ విలీనం జరిగితే ఏర్పాటయ్యే కొత్త సంస్థ విలువ రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్ డాలర్లు) ఉంటుందని ఈ సంప్రదింపులతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

also read BMW వారి బైకులకు రీకాల్ జారీ చేసింది.....ఎందుకంటే....?

కొత్త సంస్థకు ఫ్యూజియో మాతృ గ్రూప్ సంస్థ పీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ టావర్స్ సీఈఓగా, ఎఫ్సీఏ చైర్మన్ జాన్ ఎల్కాన్ చైర్మన్‌గా ఉండవచ్చునని తెలుస్తున్నది. ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, విలీన ఒప్పందం ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేమని రెండు సంస్థల వర్గాల కథనం.

ఈ పరిణామాలపై బుధవారం ఎఫ్సీఏ బోర్డు అత్యవసరంగా సమావేశమైనట్లు ఒక ఆంగ్ల వెబ్‌సైట్ తెలిపింది. ఒకవేళ, రెండు కంపెనీలు విలీనమైతే ఆల్ఫా రోమియో, క్రిస్లర్, సిట్రాన్, డాడ్జ్, డీఎస్, జీప్, లాన్సియా, మాసెరాటి, ఓపెల్, ఫ్యూజియో, వాక్స్ హాల్ వంటి బ్రాండ్లన్నీ ఒకే సంస్థ పరిధిలోకి వస్తాయి.

ప్రతిపాదిత ఫియట్, రెనాల్ట్ విలీనం విఫలమైన తర్వాత కొద్ది నెలలకు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆటోమొబైల్ రంగంలో స్థిరీకరణ ప్రాధాన్యాన్ని అటు పీఎస్ఏ, ఇటు ఫియట్ క్రిస్లర్ తరుచుగా చెబుతున్న నేపథ్యంలో ఈ రెండు గ్రూపుల విలీనంపై చర్చలు జరుగుతుండటం గమనార్హం. 

also read వచ్చేసింది...మినీ కంట్రీమాన్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్...

ఒకవైపు ఫియట్ ఇటలీ బ్రాండ్ అయినా, పీఎస్ఏతో పోలిస్తే యూరప్ దేశాల్లో బలంగా ఏమీ లేదు. మరోపక్క పీఎస్ఏకు అమెరికా మార్కెట్లో అసలు బ్రాండ్లే లేవు. ఎఫ్సీఏకు పెద్ద మార్కెట్లో క్రిస్లర్, జీప్, డాడ్జ్, రామ్ బ్రాండ్లు ఉన్నాయి. కనుక ఈ రెండు సంస్థల విలీనం ఇరు వర్గాలకు మంచి చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పీఎస్ఏ 2018లో రికార్డు స్థాయిలో 82 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించింది. అదే సమయంలో ఎఫ్సీఏ 110 బిలియన్ల యూరోల ఆదాయం పొందింది. పారిస్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదైన పీఎస్ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్ 22.54 బిలియన్ యూరోలు కాగా, ఎఫ్సీఏకు వాల్‌స్ట్రీట్‌లో 28 బిలియన్ డాలర్లు, మిలాన్‌లో 20.74 బిలియన్ల యూరోల మార్కెట్ విలువ ఉంది.