ఆటో దిగ్గజాలు ఆనంద్ వేణు శ్రీనివాస్‌లకు ‘భూషణ్‘.. 9 మందికి పద్మ శ్రీ
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్‌కు పద్మభూషణ్ దక్కింది. మరో 9 మందికి పద్మశ్రీ లభించింది.
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కార్పొరేట్ ఇండియాకు సరైన గౌరవమే దక్కింది. మొత్తం 11 మంది పారిశ్రామిక ప్రముఖులకు ఈ అరుదైన గౌరవం లభించింది.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టీవీఎస్ గ్రూప్ చైర్మన్ వేణు శ్రీనివాసన్‌కు పద్మభూషణ్ దక్కింది. మరో 9 మందికి పద్మశ్రీ లభించింది. పద్మశ్రీ దక్కిన వారిలో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చైర్మన్ ప్రేమ్ వత్స, నౌకరీ డాట్ కామ్ వ్యవస్థాపకులు సంజీవ్ బిఖ్‌చందానీ, టాలీ సొల్యూషన్స్‌కు చెంది భరత్ గోయెంకా, సింఫనీ టెక్నాలజీ చీఫ్ రోమేష్ వాద్వానీ తదితరులు ఉన్నారు.
భారత కార్పొరేట్ ప్రముఖుల్లో వేణు శ్రీనివాస్ ఒకరు. టీవీఎస్ గ్రూప్ ప్రస్తుత చైర్మన్. ఈ గ్రూప్ వ్యవస్థాపకులు టీవీ సుందరం అయ్యంగార్‌కు మనవడు. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ టీవీఎస్ మోటార్.. దేశంలోనే మూడో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు.
వేణు శ్రీనివాసన్ టీవీఎస్ గ్రూప్‌ను పలు విభాగాల్లోకి విస్తరించడంతో పాటు వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించగలిగారు. ప్రస్తుతం ఈయన టాటా గ్రూప్ వ్యాపారాల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డులోనూ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు, టాటా ట్రస్ట్ వైస్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.
ముంబై కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ప్రస్తుతం మహీంద్రా గ్రూప్ కార్లు, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఆతిథ్యం, ఏరోస్పేస్, రక్షణ, అగ్రిబిజినెస్, నిర్మాణ యంత్రాలు, పారిశ్రామిక యంత్రాల తయారీ, లాజిస్టిక్, రియల్ ఎస్టేట్, రిటైల్ వ్యాపారాల్లో ఉంది.
1981లో మహీంద్రా గ్రూప్‌లోని ఓ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా చేరిన ఆనంద్ మహీంద్రా.. అంచెలంచెలుగా ఎదుగుతూ 2012 ఆగస్టులో తన మామయ్య కేశుభ్ మహీంద్రా నుంచి గ్రూప్ చైర్మన్ బాధ్యతలను చేపట్టారు.
కెనడియన్ వారెన్ బఫెట్‌గా పిలిచే ప్రేమ్ వత్స హైదరాబాద్‌లోనే జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్)లో విద్యాభ్యాసం చేశారు.
ఐఐటీ మద్రాస్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న ఈయన కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒంటారియో నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. తొలుత ఓ బీమా కంపెనీలో పని చేసిన వత్స.. 1984లో తన మాజీ బాస్‌తో కలిసి హాంబ్లిన్ వత్స ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ పేరుతో ఇన్వె్‌స్టమెంట్ కంపెనీని ప్రారంభించారు.
ఆ తర్వాత కాలంలో కంపెనీ పేరు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్‌గా మారింది. సీఎస్బీ బ్యాంక్, థామ్‌సకుక్ ఇండియా, క్వెస్‌కార్ప్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తోపాటు ప్రస్తుతం భారత్‌లోని పలు కంపెనీల్లో ఫెయిర్‌ఫాక్స్ పెట్టుబడులు కలిగి ఉంది.
పద్మ శ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ చైర్మన్ ప్రేమ్ వత్స , సూర్య రోషిణీ లిమిటెడ్ చైర్మన్ జై ప్రకాశ్ అగర్వాల్, నౌకరీ డాట్ కామ్ వ్యవస్థాపకులు సంజీవ్ బిఖ్‌చందానీ, టాలీ సొల్యూషన్స్ వైస్ చైర్మన్ భరత్ గోయెంకా, ప్రెస్టీజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ నేమ్నాథ్ జైన్, వీఆర్‌ఎల్ గ్రూప్ చైర్మన్ కం ఎండీ విజయ్ శంకేశ్వర్, సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకులు రోమేష్ వాద్వానీతోపాటు గఫూర్‌భాయ్ బిలాఖియా,చెవాంగ్ మోటుప్ గోబా ఉన్నారు.