ప్రముఖ ఆటోమొబైల్ మేజర్ అశోక్ లేలాండ్ సంస్థ యాజమాన్య గ్రూప్ హిందుజా.. విద్యుత్ వినియోగ కార్ల ఉత్పత్తి కోసం ఏ సంస్థతోనూ కొలాబరేషన్ కోసం ఎదురు చూడటం లేదని వివరణ ఇచ్చింది.

అమెరికా కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్ వినియోగ వెహికల్ మేజర్ టెస్లాతో టైఅప్ కోసం ఎటువంటి చర్చలు జరుపలేదని తేల్చేసింది. బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న హిందుజా గ్రూప్ మూడో తరం వారసుడు.

అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందుజా కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ హెవీ కమర్షియల్ వెహికల్ మేజర్ అయిన అశోక్ లేలాండ్.. పార్టనర్ షిప్‌తో భారతదేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన టెస్లాతో సంప్రదించనే లేదని చెప్పారు. 

2018-19 ఆర్థిక సంవత్సర ఫలితాల వెల్లడి సందర్భంగా ధీరజ్ హిందుజా తాము కార్ల ఉత్పత్తి చేసేందుకు కొలాబరేషన్ కోసం చూస్తున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అసలు తమ ఫోకస్ అటువైపు లేనే లేదన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ నూతన రంగం అని, టెక్నాలజీ ముందు సిద్ధం కావాల్సి ఉన్నదన్నారు. 

‘మేం కానీ, టెస్లా యాజమాన్యం కానీ దీనిపై చర్చించలేదు’ ధీరజ్ హిందుజా స్పష్టం చేశారు. అయితే విద్యుత్ వినియోగ వాహనాల తయారీ, వాటికి అవసరమైన టెక్నాలజీకి సంబంధించి బెటర్ నాలెడ్జ్ కోసం సంప్రదిస్తున్నామని, అందుకు సంతోషిస్తున్నామని ధీరజ్ హిందుజా తెలిపారు.

జెట్ ఎయిర్వేస్ టేకోవర్ గురించి తాను స్పందించబోనని, పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆటోమోటివ్, ఎనర్జీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ అండ్ ఐటీఈఎస్, మీడియా, హెల్త్ కేర్ రంగాల్లో హిందుజా బిజినెస్ లావాదేవీలు నిర్వహిస్తోంది.

నరేశ్ గోయల్ నుంచి జెట్ ఎయిర్వేస్ సంస్థను ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం స్వాధీనం చేసుకన్నది. తాజాగా మరో సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎతిహాద్ స్వయంగా హిందుజాలతో సంప్రదింపులు జరిపింది.