No more cool AC rides: క్యాబ్ ఎక్కుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!
క్యాబ్ లో జర్నీ.. తాజా బాదుడు లెక్క తెలిస్తే నోట మాట రాదంతే. క్యాబ్ లో ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే.. దీన్ని తప్పనిసరిగా చదవాల్సిందే. ఆ మాటకు వస్తే క్యాబ్ ను వినియోగించే వారందరికి ఈ అప్డేట్ చాలా ముఖ్యం.
గడిచిన కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగి ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా స్థిరపడటం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజుల తర్వాత నుంచి రోజువారీగా అంతో ఇంతో పెంచేయటం తెలిసిందే. గడిచిన నాలుగైదు రోజుల వ్యవధిలోనే లీటరు పెట్రోల్, డీజిల్ మీద తక్కువలో తక్కువ రూ.4 వరకు పెరిగిన పరిస్థితి. ఇలా పెరిగిపోతున్న ఇంధన ధరల నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ వారి తాజా నిర్ణయం ఏమంటే.. క్యాబ్ లో ప్రయాణించేందుకు వసూలు చేసే ఛార్జీతో పాటు, ఏసీ వేయాలంటే మరింత అదనపు ఛార్జ్ చెల్లించాలన్న రూల్ ను పెట్టేసినట్లు చెబుతున్నారు. ఇంధన ధరలు అంతుపొంతు లేకుండా అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో క్యాబ్ ను బుక్ చేసుకున్న వారు ఏసీ ఆన్ చేయాలని కోరితే వారి నుంచి అదనంగా వసూలు చేసేలా నిర్ణయం తీసుుకున్నట్లు చెబుతున్నారు. ఏసీ ఆన్ చేస్తే రూ.50 నుంచి రూ.100 వరకు క్యాబ్ ఛార్జీకి అదనంగా చెల్లింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే తెలంగాణలోని క్యాబ్ సేవలు అందించే పలు కార్లలో ఈ ధరల పట్టికను తాజాగా డిస్ ప్లే చేసినట్లు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు తాము చేసిన రైడ్ తో వచ్చే ఆదాయంలో 25- 30 శాతం వరకు క్యాబ్ సర్వీసులు అందించే సంస్థలకు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.
పెరిగిన ఇంధన ధరలతో ఇబ్బంది అవుతున్న క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారానికి వీలుగా ఏసీ వినియోగిస్తే అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రతిది ధరలు పెరిగిపోయిన వేళలో సామాన్యుడు కిందా మీదా పడుతున్న వేళలోనే ఇలాంటివి చోటు చేసుకోవటం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పకతప్పదు.