Asianet News TeluguAsianet News Telugu

భారత్ మార్కెట్లోకి బెంజ్‌ వీ-క్లాస్‌.. రూ.68.40 లక్షల నుంచి మొదలు

భారతదేశ లగ్జరీ కార్ల విక్రయాల్లో నంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చుకున్న మెర్సిడెస్ బెంజ్.. తాజాగా మార్కెట్లోకి ‘వీ-క్లాస్’ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇది ఎక్స్‌ప్రెషన్, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Merc creates luxury MPV space with V Class roll-out
Author
Hyderabad, First Published Jan 25, 2019, 11:56 AM IST

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌.. భారత మార్కెట్లోకి మల్టీ పర్పస్‌ వెహికిల్‌ (ఎంపీవీ) వీ-క్లాస్ కారును ఆవిష్కరించింది. స్పెయిన్‌లో తయారయ్యే ఈ కారును రెండు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది సంస్థ. 

ఎక్స్‌ప్రెషన్, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్లలో బెజ్ వీ క్లాస్
ఎక్స్‌ప్రెషన్‌ వేరియంట్ కారు ధర రూ.68.40 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్‌ వేరియంట్‌ రూ.81.90 లక్షలకు లభించనుంది. 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారును ఏడు సీట్ల సామర్థ్యంతో బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించారు. ఈ కారును ఇప్పటికే ప్రపంచంలో 90కి పైగా దేశాల్లో విక్రయిస్తున్నట్లు మెర్సిడెజ్‌ బెంజ్‌ తెలిపింది.
 
నాలుగేళ్లుగా భారత్ లో అగ్రశ్రేణి సంస్థ మెర్సిడెస్
భారత విలాస కార్ల మార్కెట్‌లో 40 శాతానికి పైగా మార్కెట్‌ వాటా కలిగిన బెంజ్‌ వరుసగా నాలుగేళ్ల నుంచి అగ్రశ్రేణి కంపెనీగా కొనసాగుతోంది. గత ఏడాది ఈ సంస్థ ఇండియాలో 15,538 వాహనాలను విక్రయించింది. ఇంతకుముందు ఏడాదిలో లగ్జరీ వెహికల్ సెగ్మెంట్‌లో 25 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. కానీ 2018లో కేవలం 41 వేల కార్లు మాత్రమే అమ్ముడు పోవడం ఇబ్బందికర పరిణామం. 

2019 మోడళ్లలో వీ-క్లాస్ ఫస్ట్
2019లో విడుదల చేయనున్న పది కొత్త మోడళ్లలో వీ-క్లాస్‌ మొదటిదని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఇండియన్‌ మార్కెట్లోకి లగ్జరీ ఎంపీవీని ప్రవేశపెట్టడం సంస్థకు ఇది రెండో సారి. ఆశాజనక విక్రయాలు లేని కారణంగా గత లగ్జరీ ఎంపీవీ మోడల్‌ ఆర్‌-క్లాస్‌ను 2011లో మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకుంది. 

విక్రయాల్లో 2018 సవాల్ అన్న మెర్సిడెస్ ఎండీ మార్టిన్ స్కూవెంక్
మెర్సిడెస్ బెంజ్ నూతన సీఈఓ, ఎండీ మార్టిన్ స్కూవెంక్ మాట్లాడుతూ కార్ల విక్రయాల్లో 2018 తమకు సవాలుగా నిలిచిందని, తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కారణంగా తమ ఉత్పత్తుల విక్రయం దూకుడుగా సాగడమేనని చెప్పారు. వీ -క్లాస్ మోడల్ కార్ల విక్రయాల రికార్డుపై తాము ఆసక్తిగా ఉన్నామన్నారు. ఈ ఏడాది భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ రజతోత్సవాన్ని జరుపుకోనుండటం గమనార్హం. 

విధానాలు స్పష్టమైతే భారత్‌కు విద్యుత్ కార్లు: కియో
భారత మార్కెట్లో విద్యుత్ వినియోగ కార్లను సైతం ప్రవేశపెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు దక్షిణ కొరియా ఆటో సంస్థ కియా మోటార్స్‌ తెలిపింది. విద్యుత్ వాహనాల(ఈవీ) విషయంలో ప్రభుత్వ విధానాలపై స్పష్టత లభించిన వెంటనే ఈ టెక్నాలజీ కార్లను భారత్‌కు తీసుకొస్తామని కియా మోటార్‌ ఇండియా మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగాల అధిపతి మనోహర్‌ భట్‌ తెలిపారు. 

ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి ఏపీ తొలికారు
కియా మోటార్స్‌ అనుబంధ విభాగమైన కియా మోటార్స్‌ ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో తన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తొలి మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios