న్యూఢిల్లీ: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విటారా బ్రెజా పెట్రోల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌-6 ప్రమాణాలతో వచ్చిన ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోనున్నదని సంస్థ తెలిపింది. పాత వెర్షన్‌తో పోలిస్తే లుక్స్‌లో కొన్ని మార్పులు చేశారు. 

ఇక వేరియంట్‌ని బట్టి ధరను రూ.7.34 లక్షల నుంచి రూ.11.40 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని 2020 ఆటో ఎక్స్‌పోలోనే ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 102 బీహెచ్పీ శక్తిని 134 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక లార్జర్‌ ఎయిర్‌ ఇంటేక్స్‌ ఉన్న క్రోమ్‌ గ్రిల్‌ బంపర్‌ కార్‌కు కొత్త లుక్‌ని సమకూర్చింది. హెడ్‌ల్యాంప్స్‌లో కూడా మార్పులు చేశారు. డేటైమ్‌ రన్నింగ్ ఎల్ఈడీ లైట్లతో పాటు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ లెన్స్‌ పొందుపరిచారు. స్మార్ట్‌ప్లే స్టూడియో 2.0 ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ తెర అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

Also read:ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ కు డోర్స్ క్లోజ్! ఇవీ కారణాలు!!

ఇంతకుముందు విటారా బ్రెజ్జా కేవలం డీజిల్ ఇంజిన్ వర్షన్‌లో మాత్రమే వెలువడింది. బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి రానుండటంతో పెట్రోల్ వేరియంట్ కారును వినియోగదారుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. ఎర్టిగా, సియాజ్ మోడల్ కార్ల నుంచి 1.5 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ తీసుకొచ్చి ఇందులో వాడారు. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ విత్ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీతో ఈ కారు రూపుదిద్దుకున్నది. 

ఆరు రంగుల్లో విటారా బ్రెజ్జా మోడల్ కారు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. డ్యూయల్ టోన్డ్ కలర్ స్కీమ్‌లో లభిస్తుంది. మెటాలిక్ సిజ్లింగ్ రెడ్ విత్ మిడ్ నైట్ బ్లాక్ రూఫ్, టార్చ్ బ్లూ విత్ మిడ్ నైడ్ బ్లాక్ రూఫ్ (న్యూ), ఆటం ఆరంజ్, గ్రానైట్ గ్రే, పెరల్ ఆర్టిక్ వైట్, ప్రీమియం సిల్వర్, గ్రానైట్ గ్రే విత్ ఆటం ఆరెంజ్ రూఫ్ రంగుల్లో లభించనున్నది.