వచ్చే పండుగల సీజన్‌ను సొమ్ము చేసుకోవాలని తలపోస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. ప్రధానంగా లగ్గరీ, వ్యక్తిగత కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ సంస్థ అదే దారిలో పయనిస్తోంది. దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ/ఎల్డీఐ కారు నూతన వెర్షన్‌ను మారుతి సుజుకీ అందుబాటులోకి తెచ్చింది ఈ కారు ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగా గరిష్ఠంగా రూ.8.76 లక్షలుగా నిర్ణయించింది సంస్థ. 

ప్రస్తుత ఏడాది గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు ఎట్టకేలకు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది సంస్థ. ఫిబ్రవరి నుంచి ప్రతినెల సరాసరి 19 వేలకు పైగా స్విఫ్ట్ కార్లను విక్రయించిన సంస్థ. ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ నూతన కారును వినియోగదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

మూడో జనరేషన్‌గా రూపొందించిన ఈ కారు 1.2 లీటర్ల కే-సిరీస్ డీవోహెచ్‌సీ పెట్రోల్ ఇంజిన్ 22 కిలోమీటర్లు, 1.3 లీటర్ల టర్బోచార్జర్ డీజిల్ డీడీఐఎస్ ఇంజిన్ కలిగిన కారు 28.4 కిలోమీటర్ల మైలేజి ఇవ్వనున్నదని కంపెనీ తెలిపింది. 

ఈ కారులో రెండు స్పీకర్లతో బ్లూటూత్ స్టీరియో అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ పెయింటెడ్ వీల్ క్యాప్స్ ఉన్నాయి. గత స్విఫ్ట్ మోడల్ కారుతో పోలిస్తే అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. ఫ్రంట్ పవర్ విండోస్, ఏబీఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సర్లు అందుబాటులో ఉన్నాయి. తాజా మారుతి సుజుకి స్విఫ్ట్ స్పెషల్ ఎడిషన్ మోడల్ కారు ప్రత్యర్థి సంస్థలు హ్యుండాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో మోడల్ కార్లకు పోటీగా మార్కెట్‌లోకి అడుగు పెట్టింది.