దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా దక్షిణ భారతావనిలో తన కార్యకలాపాల విస్తరణపై ద్రుష్టిని కేంద్రీకరించింది. దేశీయంగా విక్రయాలతోపాటు విదేశాలకు ఎగుమతిపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన మారుతి సుజుకి ఉత్పాదక యూనిట్లన్నీ గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి.

తాజాగా మూడో ఉత్పాదక యూనిట్ దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. దక్షిణ భారతదేశ పరిధిలో ఉత్పత్తి చేయడం వల్ల విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా వీలు కలుగుతుందన్నారు. 

సమీప భవిష్యత్‌లో దక్షిణ భారతదేశం ఆటోమొబైల్ రంగానికి నూతన హబ్ గా అవతరించనున్నదని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలు ఆటోమొబైల్ సంస్థల ఉత్పాదక యూనిట్ల ఏర్పాటు చేయడానికి పన్నుల్లో కల్పిస్తున్న రాయితీలు, మౌలిక వసతులు దీనికి కారణమన్నారు.

మరోవైపు నౌకాశ్రయాలు కూడా చేరువలో ఉండటం వల్ల విదేశాలకు ఎగుమతులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ఆటోమొబైల్ సంస్థలకు స్వాగతం పలుకుతున్నదని తెలిపారు. 

ఇప్పటికే కియా మోటార్స్ సంస్థ తన తొలి ఉత్పాదక యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించిందని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. తాజాగా హీరో మోటో కార్ప్ సంస్థ తన ఎనిమిదో ఉత్పాదక యూనిట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిర్మిస్తున్నదని తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో హ్యుండాయ్ మోటార్స్, నిస్సాన్, బీఎండబ్ల్యూ మోటార్స్ కార్ల ఉత్పత్తి సాగుతున్నదని చెప్పారు. మారుతి సుజుకి గుజరాత్ రాష్ట్రంలో ఏటా 2.5 లక్షల కార్ల ఉత్సత్తి సామర్థ్యం కలిగి ఉన్నది.

2020 నాటికి దాన్ని 7.5 లక్షల యూనిట్లకు విస్తరించాలన్నది తమ లక్ష్యమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. 2020 నాటికి అన్ని వసతులతో ఏటా 20 లక్షల ప్రయాణికుల కార్లను విక్రయించాలని కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గుజరాత్ రాష్ట్రంలోని మూడో యూనిట్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నామన్నారు. హర్యానాలోని మానేసర్, గుర్గ్రామ్ ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల కార్ల ఉత్పాదక సామర్థ్యం ఉన్నది.

దీన్ని క్రమంగా 2030 నాటికి 30 లక్షల యూనిట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచాలన్నది మారుతి సుజుకి లక్ష్యాల్లో ఒకటి. గుర్ గ్రామ్ పరిధిలో ట్రాఫిక్ ఒత్తిళ్లు పెరుగడంతో సంస్థ ఉత్పాదక యూనిట్ ను తరలించాలన్న డిమాండ్ వస్తున్నదని ఆర్సీ భార్గవ తెలిపారు. దీనికి ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హర్యానాలోని మరో ప్రదేశంలోనే గుర్ గ్రామ్ యూనిట్ ను బదిలీ చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నది తెలిపారు.