Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్లలో ‘టయోటా’తో మారుతి ‘విద్యుత్ కారు’: డీలర్లకు ఇలా అండదండలు

రెండేళ్లలో భారతీయ మార్కెట్‌లోకి తొలి ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానున్నది. దీనికి మారుతి సుజుకి, టయోటా మోటార్ కార్స్‪లతో కూడిన ఉమ్మడి వెంచర్ ఇందుకు సారధ్యం వహించనున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌పైకి రానున్నది.  

Maruti Suzuki wants suppliers to sell spare parts through dealerships
Author
Hyderabad, First Published Aug 22, 2018, 1:17 PM IST

న్యూఢిల్లీ: యావత్ ప్రపంచమూ పర్యావరణ హితమే ప్రధానంగా ముందుకు వెళుతోంది. అందులో తామూ భాగస్వాములవుతామని చెబుతోంది ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి ఇండియా’. టయోటా మోటార్ కార్పొరేషన్‌తో కలిసి 2020 నాటికి తొలి విద్యుత్ కారును మార్కెట్‌లోకి తేవాలని భావిస్తోంది. తద్వారా శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింపు యజ్ణంలో భాగస్వామి కావాలని తహతహలాడుతోంది. గత ఏప్రిల్ నెలలో జపాన్‌కు చెందిన ఈ రెండు సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభించాయి.

దీనికి తోడు మారుతి సుజుకి ఇండియా తన డీలర్లు, సర్వీస్ సెంటర్ల యాజమాన్యాలకు  అదనపు ఆదాయాన్ని, లాభాలు తెచ్చి పెట్టేందుకు వీలుగా ఓ మంచి నిర్ణయం  తీసుకున్నదని మారుతి సుజుకి యాజమాన్యం సన్నిహిత వర్గాలు చెప్పాయి.  

మారుతి సుజుకి తన కార్ల విడి భాగాలు, టైర్లు, ఇంజిన్ ఆయిల్ సరఫరా దారులు, బ్యాటరీ తయారీదారుల నుంచి ఆయా వస్తువులను డీలర్లు, సర్వీస్ సెంటర్ల వద్దకే నేరుగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. తద్వారా ఇప్పటివరకు తన ఉత్పాదక కేంద్రాలకే వస్తున్న విడి భాగాలు, ఇంజిన్ ఆయిల్, టైర్ల వల్ల వచ్చే రాయాల్టీ డీలర్లకు, సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకే చెందుతుంది. దీనికి ప్రతిగా కొంత మొత్తం రాయల్టీని ఆయా విడిభాగాలు, టైర్లు, ఇంజిన్ ఆయిల్ సరఫరా సంస్థలపై విధిస్తుంది. దీంతో ఇరు పక్షాలకు ఉభయతారకంగా లాభాలు ఉండేలా వ్యూహాన్ని మారుతి సుజుకి సూచించినట్లు సమాచారం. 

నాణ్యతతో కూడిన కార్ల నిర్మాణం చేపట్టడంతో మున్ముందు డీలర్లు, మరమ్మతు అండ్ సర్వీస్ సెంటర్ల ఆదాయం తగ్గిపోతుందని మారుతి సుజుకి యాజమాన్యం వచ్చింది. ఈ క్రమంలోనే డీలర్లు, సర్వీస్ సెంటర్లకు అదనపు లాభాలార్జించి పెట్టేందుకు చొరవ తీసుకున్నది. ప్రస్తుతం మారుతి సుజుకి డీలర్లకు తమ సర్వీస్ సెంటర్ల నుంచి 70 శాతం లాభం లభిస్తోంది. 

గత కొన్నేళ్లుగా కార్ల ఉత్పత్తిలో నాణ్యత గణనీయంగా మెరుగవుతున్నదని మారుతి సుజుకి వర్గాలు చెప్పాయి. ప్రత్యేకించి ప్రీమియం సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి క్వాలిటీ పెరిగిందని ఆ వర్గాల కథనం. వచ్చే ఏడాది నుంచి కాలుష్య నియంత్రణ, పర్యావరణ అనుకూలత, రక్షణ ఏర్పాట్లతో కార్ల నిర్మాణం చేపట్టనున్నందున వాటి క్వాలిటీ మరింత పెరుగుతుంది. అదే జరిగితే సర్వీస్ సెంటర్లకు వచ్చే కార్లు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు మారుతి సుజుకి అధికార ప్రతినిధి నిరాకరించారు. 

ఇప్పటి వరకు బహుళ వస్తువుల డీలర్ల వద్ద మారుతి సుజుకి డీలర్లు విడి భాగాలను కొనుగోలు చేసేవారు. మారుతి సుజుకి ఇంతకుముందు ట్రూ వాల్యూ బ్రాండ్, వెహికల్ ఫైనాన్సింగ్ బిజినెస్‌ను డీలర్లకు అందుబాటులోకి తెచ్చింది. తద్వారా దీర్ఘకాలంలో మారుతి సుజుకి డీలర్ల ఆదాయం తగ్గిపోకుండా చర్యలు తీసుకున్నది.

మార్కెట్స్ అండ్ మార్కెట్స్ అనే రీసెర్చ్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ అనిల్ శర్మ మాట్లాడుతూ అదనపు ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవడం ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం అని వ్యాఖ్యానించారు. వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరనున్నదని, ఒకేచోట విడి భాగాలు దొరికేలా చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఐదేళ్లుగా కార్ల సర్వీసింగ్ సెంటర్ల లాభాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios