మారుతి బ్రెజ్జా vs టాటా నెక్సాన్.. ఈ రెండు ఎస్‌యూవిల మధ్య తేడా ఏంటి..ఏది బెటర్..?
ఇండియాలో తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసిన 2016 సంవత్సరంతో పోలిస్తే మార్కెట్ ప్యాటర్న్ ఖచ్చితంగా మారిపోయింది. బ్రెజ్జాకి పోటీగా ఇతర బ్రాండ్ కార్లు కూడా తెరపైకి వచ్చాయి.
మారుతి సుజుకి బ్రెజ్జా ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలైంది. కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌తో వస్తున్న బ్రెజ్జా మార్కెట్ వాటాను తిరిగి పొందగలదని భావిస్తున్నారు. అయితే, ఇండియాలో తొలిసారిగా కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసిన 2016 సంవత్సరంతో పోలిస్తే మార్కెట్ ప్యాటర్న్ ఖచ్చితంగా మారిపోయింది. బ్రెజ్జాకి పోటీగా ఇతర బ్రాండ్ కార్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇప్పుడు టాటా నెక్సాన్ 2022లో సేల్స్ పరంగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ SUVగా మారింది. మారుతి సుజుకి బ్రెజ్జాకి స్ట్రాంగ్ పోటీదారులలో ఒకటైన టాటా నెక్సాన్‌తో పోలిస్తే ఏది బెస్ట్ ఏది బెటర్ తెలుసుకుందాం...
ఇంజిన్ అండ్ గేర్‌బాక్స్
బ్రెజ్జా కొత్త జనరేషన్ 1.5-లీటర్ K-సిరీస్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 102 బిహెచ్‌పి పవర్, 135 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు స్టీరింగ్‌పై ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన ఆటోమేటిక్ యూనిట్‌తో అందిస్తున్నారు.
Nexon 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 120 PS పవర్, 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 110 PS పవర్, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ MTతో అందుబాటులో ఉన్నాయి.
కార్ సైజ్
కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా పాత మోడల్ లాగానే పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. అయితే, ఇప్పుడు పాత మోడల్ కంటే 45 ఎం.ఎం పెద్దగా ఉంటుంది. కొత్త బ్రెజ్జా పొడవు 3,995 ఎం.ఎం, వెడల్పు 1,790ఎం.ఎం, ఎత్తు 1,685 ఎం.ఎం. వీల్‌బేస్ 2,500 ఎం.ఎం.
మరోవైపు, Tata Nexon పొడవు 3,994 ఎం.ఎం, వెడల్పు 1,811 ఎం.ఎం, ఎత్తు 1,607 ఎం.ఎం. Nexon వీల్‌బేస్ 2,498 ఎం.ఎం పొడవు ఉంటుంది. వీల్ సైజు గురించి చెప్పాలంటే ఈ రెండు కాంపాక్ట్ SUVలు 16-అంగుళాల వీల్స్ పొందుతాయి.
ఫీచర్లలో ఏది బెటర్?
ఈ రెండు SUVలు చాలా ఫీచర్లను పొందుతాయి. కానీ బ్రెజ్జా స్కోర్ కొంచెం ఎక్కువ. దీనికి 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, స్టీరింగ్-మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. అయితే, నెక్సాన్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంకా ఇతర ఫీచర్లతో వస్తుంది. ఇతర కంఫర్ట్ ఫీచర్లు రెండు మోడళ్లలోనూ ఒకే విధంగా ఉంటాయి.
ధర
మారుతి సుజుకి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షలు. టాప్ మోడల్ ధర రూ. 13.96 లక్షలు. టాటా నెక్సాన్ కాంపాక్ట్ SUV ధర రూ. 7.55 లక్షల ఎక్స్-షోరూమ్ వద్ద ప్రారంభమవుతుంది. Nexon టాపింగ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.90 లక్షలు.