Asianet News TeluguAsianet News Telugu

Maruti Suzuki: మారుతీ సుజుకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాకపోవడానికి కారణమేమిటి..?

రోడ్లపై తిరిగే చాలా కార్లలో మారుతీ సుజుకివే ఉంటుంటాయి. కానీ ఇటీవల చాలా కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను తీసుకొస్తున్నా.. మారుతీ సుజుకి మాత్రం ఈ కార్ల‌ జోలికి వెళ్లడం లేదు. మారుతీ సుజుకి ఇప్పటి వరకు ఒక్క ఎలక్ట్రిక్ ఈవీని కూడా లాంచ్ చేయలేదు. అసలు మారుతీ సుజుకి ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాకపోవడానికి కారణమేమిటి..? ఎందుకు ఈ కంపెనీ ఈ కొత్త రకం టెక్నాలజీపై ఆసక్తి చూపడం లేదో ఓసారి చూద్దాం..!
 

Maruti Suzuki bets on hybrids over electric vehicles in clean shift
Author
Hyderabad, First Published Jun 27, 2022, 4:20 PM IST

భారత్ రోడ్లపై చూస్తే.. చాలా వరకు మారుతీ సుజుకి కార్లే కనిపిస్తాయి. కానీ ఈ కార్ల కంపెనీ ఇప్పటి వరకు ఒక్క ఎలక్ట్రిక్ వెహికిల్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురాలేదు. ఒకవైపు నుంచి ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. మరోవైపు దేశీయ కార్ల దిగ్గజంగా ఉన్న మారుతీ సుజుకి మాత్రం ఇప్పటి వరకు ఈవీని తీసుకురాలేదు. అయితే ఈ కార్ల కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను మార్కెట్లోకి తీసుకురాకపోవడానికి గల కారణాలను బయటికి వెల్లడించింది. ఎలక్ట్రిక్ కార్ల వల్ల గాలి కాలుష్యం తగ్గదని మారుతీ సుజుకి ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ తెలిపారు. భారత్‌లో 75 శాతం విద్యుత్‌ను బొగ్గును కాల్చడం ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారని భార్గవ అన్నారు. దీని వల్ల మరింత కాలుష్యం ఏర్పరుడుతుందని చెప్పారు.

ఎలక్ట్రిక్ కారుతో పోలిస్తే టయోటా హైబ్రిడ్ కారు తక్కువ కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల నుంచి కార్బన్ న్యూట్రాలిటీని సాధించడం కష్టతరమని అన్నారు. మారుతీ సుజుకి కార్పొరేషన్, టయోటా కలిసి వచ్చే 12 నెలల్లో భారత మార్కెట్లోకి హైబ్రిడ్ కారును లాంచ్ చేయబోతున్నాయి.

ఎలక్ట్రిక్ కార్లకు ఖర్చు ఎక్కువ

పశ్చిమ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుందని భార్గవ చెప్పారు. భారత్‌లో కార్లు కొనే వాళ్లు ఎక్కువగా రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల విలువైన వెహికిల్స్‌ను కొనుగోలు చేస్తారని, కానీ ఎలక్ట్రిక్ కార్ల ఖర్చే వీటి కంటే 50 శాతం అత్యధికంగా ఉంటుందని తెలిపారు. కారు కొనుగోలుదారులకు కనీసం పార్క్ చేసుకునేందుకు, గ్యారేజ్‌లో పెట్టేందుకే స్థలం ఉండదని, అలాంటిది ఛార్జ్ ఇంకెక్కడ చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్ల ఖర్చు అత్యధికంగా ఉండటం వల్లే.. అమ్మకాలు తక్కువగా ఉన్నాయని భార్గవ తెలిపారు. భారత్ బీఎస్4 నుంచి బీఎస్6లోకి మారినప్పుడు.. కార్ల ధరలు పెరిగి, అమ్మకాలు పడిపోయాయి. చిన్న కార్ల అమ్మకాలు 28 శాతం తగ్గిపోయాయి. ఇదే సమయంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు పెరిగాయి.

మెరుగైన ఆప్షన్ బయోగ్యాస్

కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లు కాకుండా ఇతర చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని మారుతీ సుజుకి ఛైర్మన్ భార్గవ అన్నారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, ఇథనాల్, హైబ్రిడ్, బయోగ్యాస్ వంటివి లభిస్తున్నాయని చెప్పారు. వీటన్నింటిన్ని వాడుకోవాల్సినవసరం ఉందన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేవలం ఒక్క టెక్నాలజీనే ప్రోత్సహించడం సరియైనది కాదన్నారు. భారత్‌లో పెద్ద మొత్తంలో వ్యవసాయానికి సంబంధించిన వ్యర్థాలు ఉంటాయని, కానీ వీటిని చాలా తక్కువగా బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు వాడుతున్నామని తెలిపారు. వీటిని పూర్తిగా వాడితే.. ఇవి చాలా కీలకంగా మారతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలతో కలిసి బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు మారుతీ సుజుకి ప్రయత్నిస్తోంది. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం పలు ప్రోత్సహకాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందని భార్గవ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios