దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జంట రికార్డులను సొంతం చేసుకున్నది. ఈ నెల 14న మార్కెట్లోకి రానున్న మహీంద్రా ఎక్స్ యూవీ 300 మోడల్ కారు బుకింగ్స్ గత నెలలోనే ప్రారంభమయ్యాయి.

అయితే ఇప్పటికే 4000 మంది ఈ మోడల్ కారు కోసం బుకింగ్స్ నమోదు చేశారు. తద్వారా కార్ల తయారీ రంగంలో నూతన చరిత్ర నెలకొల్పింది మహీంద్రా అండ్ మహీంద్రా. దీనికి తోడు 60 వేల మంది ఈ సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు కోసం ఎంక్వైరీ చేశారు. 

7 ఎయిర్ బ్యాగులు, సన్ రూప్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్ కారులో అదనపు ఆకర్షణ కానున్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ  మోడల్ కారు మారుతి సుజుకి విటారా, బ్రెజ్జాలతోపాటు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లతో తల పడనున్నది. షార్ప్ లుకింగ్ ఫేస్ గల చీటా స్ఫూర్తితో నూతన మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారును డిజైన్ చేశారు. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్ కారును 1.2 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్, 1.5 లీటర్ల సామర్థ్యం గల డీజిల్ ఇంజిన్ రూపొందించారు. 

ఐదు నెలల్లో మహీంద్రా మర్రాజో 19 వేల బుకింగ్స్
ఐదు నెలల క్రితం గతేడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా మర్రాజో కారును మార్కెట్లోకి విడుదల చేసింది మహీంద్రా.. నాటి నుంచి 19 వేల బుకింగ్స్ నమోదు చేసుకున్నది ఈ సంస్థ. నెలకు సగటు 3,500 యూనిట్ల బుకింగ్స్ నమోదవుతున్నాయి.

అదే సమయంలో డెలివరీకి కూడా మహీంద్రా యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోంది. బుకింగ్ నమోదైన నాలుగు వారాల్లో వినియోగదారుడికి అందుబాటులోకి వస్తుంది. ఇప్పటివరకు 15 వేల కార్లను విడుదల చేసింది మహీంద్రా.