మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన మల్టీ-పర్పస్ వాహనం (ఎంపీవీ) మరాజో ధరను రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేసే సమయంలో ప్రారంభ ఆఫర్ కింద ధరను రూ.9.99 లక్షల నుంచి రూ.13.90 లక్షల మధ్యలో నిర్ణయించింది. 

విడుదల చేసే సమయంలోనే మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా ఇవి ప్రారంభ ఆఫర్ ధరలని, ఏ క్షణంలోనైనా పెంచే అవకాశం ఉన్నదని సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత ధరలను పెంచుతున్నట్లు కంపెనీ మార్కెటింగ్ అధిపతి విజయ్ రామ్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు.

మహీంద్రా మరాజో ఏడు సీటర్లు, ఎనిమిది సీట్ల కారుతో రూపుదిద్దుకున్నది. కొత్త మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించిన నాలుగు నెలల తర్వాత ధర పెంచడానికి సరైన సమయమేనని చెబుతోంది. మహీంద్రా డిజైన్ స్టూడియో, ప్రసిద్ధి పొందిన ఇటాలియన్ డిజైన్ హౌస్ పినిన్ఫారినా సంయుక్తంగా మహీంద్రా మరాజో డెవలప్ చేశాయి.