2022 కవాసకి నింజా 400 బైక్ భారత మార్కెట్లో విడుదలైంది. దీనితో పోటీ పడే ప్రత్యర్థి బైక్ ఇండియాలో లేనప్పటికీ KTM RC 390 పోటీపడుతుంది. ఈ బైక్ ధర, ఇతర విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.  

జపనీస్ బైక్ మేకర్ కవాసకి సుమారు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ భారత్ మార్కెట్లో తమ కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. 2022 కవాసకి నింజా 400 (Kawasaki Ninja 400) కొద్ది రోజుల క్రితమే గ్లోబల్ మార్కెట్‌లో విడుదల కాగా, తాజాగా ఈ బైక్ మన మార్కెట్లోకి వచ్చి చేరింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ గణనీయంగా అప్‌గ్రేడ్ అయింది. BS6-అవతార్‌లో వచ్చిన ఈ బైక్ మరింత పవర్ ఫుల్‌గా, మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇందులో శక్తివంతమైన 399 సిసి, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్ ట్విన్ మోటార్ ఇంజన్ ఇచ్చారు.

భారత్‌లో ఈ సూపర్ బైక్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 4.99 లక్షలు. ఇప్పటికే ఈ బైక్ బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. త్వరలోనే డెలివరీలు కూడా జరగనున్నాయి. దీనితో ప్రత్యర్థి KTM RC 390 బైక్ కంటే కూడా నింజా 400 దాదాపు రూ. 1.85 లక్షలు ఖరీదైనది. మరి ఈ ఖరీదైన బైక్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

Kawasaki Ninja 400 స్పెసిఫికేషన్లు

2022 కవాసకి నింజా 400 మోడల్‌లో BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 399 సిసి సామర్థ్యం కలిగిన సమాంతర-ట్విన్ మోటారును అమర్చారు. దీని టార్క్ ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. ఫలితంగా దీని ఇంజన్ 44bhp పవర్ వద్ద 37Nm టార్కును విడుదల చేస్తుంది. KTM RC 390 పోల్చి చూస్తే.. కేటీఎంలోని 373cc, సింగిల్-సిలిండర్ మోటార్ 42.9bhp వద్ద 37Nm టార్కును ఉత్పత్తి చేయగలదు.

2022 కవాసకి నింజా 400లో ఎబోనీతో లైమ్ గ్రీన్, మెటాలిక్ కార్బన్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. మిగతా డిజైన్, ఫీచర్లు, హార్డ్‌వేర్ పరంగా మునుపటి వెర్షన్ మోటార్‌సైకిల్ లాగే ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందువైపు 41mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఇవ్వగా, వెనుకవైపున ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. అదేవిధంగా బ్రేకింగ్ కోసం ముందు వైపున సింగిల్ 310mm, వెనకాల సింగిల్ 220mm రోటర్ బ్రేకింగ్ విధులను నిర్వహిస్తుంది. ఇవి డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్‌తో జతచేసి ఉంటాయి. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను జతచేశారు.

మిగతా ఫీచర్లను పరిశీలిస్తే ఈ నింజా 400 బైక్ సెమీ-డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో చక్కని 12,000rpm రెడ్‌లైన్‌తో అనలాగ్ టాకోమీటర్‌ను కలిగి ఉంది. అలాగే ట్విన్ LED హెడ్‌లైట్‌లు, అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్, డాష్‌పై ECO సూచిక, నిటారుగా ఉండే విండ్‌స్క్రీన్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, 14-లీటర్ స్కల్ప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, గేర్ పొజిషన్ ఇండికేటర్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి.