న్యూఢిల్లీ: హ్యుండాయ్ మోటార్స్ ఇండియా వివిధ రకాల తన మోడల్ కార్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. ఇటీవలి ఫెస్టివ్ సీజన్‌లో అక్టోబర్ నెలలో దేశీయంగా హ్యుండాయ్ మోటార్స్ సేల్స్ 3.8 శాతం పడిపోయాయి. దీంతో తన సేల్స్ పెంచుకోవడానికి హ్యుండాయ్ మోటార్స్ భారీ ఆఫర్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చింది. వివిధ రకాల మోడల్ కార్ల ధరలపై రూ.2 లక్షల వరకు రాయితీలు అందిస్తోంది.

నవంబర్ నెలలో హ్యుండాయ్ మోటార్ ఇండియా కేవలం క్రెటా, వెర్నా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10, శాంత్రో, ఎక్స్‌సెంట్, టుక్‌సన్ మోడల్ కార్లతోపాటు ఇటీవల విపణిలో ఆవిష్కరించిన ఎలంత్రా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ మోడల్ కార్లపైనా ధరలో రాయితీ తగ్గిస్తోంది. 

హ్యుండాయ్ క్రెట్టా మోడల్ ఎస్ యూవీ కారు ధర రూ.10 లక్షల నుంచి రూ.15.67 లక్షల వరకు పలుకుతుంది. ఈ కారులో పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.80 వేల వరకు బెనిఫిట్లు అందుబాటులో ఉన్నాయి. 

హ్యుండాయ్ వెర్నా మోడల్ సెడాన్ కారు ధర రూ.8.18 లక్షల నుంచి రూ.14.08 లక్షల వరకు పలుకుతోంది. దీనిపై పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.60 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

హ్యుండాయ్ ఎలైట్ ఐ20 మోడల్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ధర రూ.5.53 లక్షల నుంచి రూ.9.34 లక్షలకు ఉంటుంది. దీనిపై పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లపై రూ.65 వేల వరకు రాయితీనిస్తోంది హ్యుండాయ్.

హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 మోడల్ కారు ధర రూ.5.79 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు పలుకుతోంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ.75 వేల వరకు ఆఫర్ అందిస్తోంది హ్యుండాయ్ మోటార్స్. 

హ్యుండాయ్ శాంత్రో కారు ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.79 లక్షల వరకు ఉంటుంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల మోడల్ కారుగా హ్యుండాయ్ శాంత్రో నిలిచింది. దీనిపై పెట్రోల్ వేరియంట్ కారుపై రూ.55 వేలు తగ్గిస్తోంది.