మరో మైలురాయి: 2.5 కోట్లకు హీరో మోటోకార్ప్ సేల్స్
అంతర్జాతీయంగానే అత్యధిక ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటో కార్ప్స్ మరో మైలురాయిని నమోదు చేసింది. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించిన 11 ఏళ్లలో 2.5 కోట్ల బైక్‌లను తయారు చేసిన యూనిట్‌గా రికార్డు తెచ్చిపెట్టింది.
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ విక్రయాల్లో మరో మైలురాయిని దాటింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే వాహన అమ్మకాలు 2.5 కోట్ల మార్కును అధిగమించినట్లు బుధవారం ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ద్విచక్ర వాహనాల ఉత్పాదక ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 9,500 యూనిట్లు కాగా, ప్రారంభించిన 11 ఏళ్లలోనే ఈ స్థాయి రికార్డును నెలకొల్పడం విశేషమని కంపెనీ వివరించింది. 2008 ఏప్రిల్ నెలలో హరిద్వార్ హీరో మోటో కార్ప్ ఉత్పత్తిని మొదలుపెట్టింది.
also read ఆటోమొబైల్ సంస్థలకు తీపి గుర్తులు
తాజాగా తమ సంస్థ సాధించిన ఘనత కేవలం ఈ ఒక్క ప్లాంట్‌కే కాకుండా, మొత్తం కంపెనీ విజయంగా భావిస్తున్నామని హీరో మోటో కార్ప్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్), చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విక్రమ్ కస్బేకర్ చెప్పారు. ఉత్పత్తి ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే 2.5 కోట్ల వాహనాల ఉత్పత్తి సాధించడం తమ అంకిత భావానికి నిదర్శనమని చెప్పారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ నగరంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఎక్కువగా హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ఈస్మార్ట్ 110, ప్యాషన్ ప్రో, ప్యాషన్ 110 మోడల్ బైక్‌లను ఉత్పత్తి చేయడంలో పేరొందింది. దేశీయంగా ఐదు ఉత్పత్తి యూనిట్లు గల హీరో మోటో కార్ప్స్ బంగ్లాదేశ్, కొలంబియాల్లో ఒక్కో యూనిట్ కలిగి ఉంది.
also read వచ్చేసింది...మినీ కంట్రీమాన్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్...
భారతదేశంలో హర్యానా రాష్ట్రం గుర్ గ్రామ్, ధారుహెరా, రాజస్థాన్ రాష్ట్రం నీమ్రానా, గుజరాత్ రాష్ట్రం హలోల్ పట్టణంతోపాటు హరిద్వార్ ల్లో ఉత్పాదక యూనిట్లను కలిగి ఉన్నది హీరో మోటో కార్ప్స్. కంపెనీ ఎనిమిదో ఉత్పాదక యూనిట్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో త్వరలో అందుబాటులోకి రానున్నది. దేశీయంగా సంస్థ వార్షిక వాహనాల ఉత్పత్తి ప్రస్తుతం 90 లక్షలుగా నిర్ణయించారు.