కొత్త సంవత్సరంలో బీఎస్-6 బైక్స్ అమ్మకాలపై ఆశలు
బీఎస్-6 ప్రమాణాలతో భారత విపణిలోకి కొత్త మోటారు సైకిళ్లను ఆవిష్కరించడంతో తమ విక్రయాలు పెరుగుతాయని బ్రిటన్ మోటారు బైక్స్ సంస్థ ట్రయంఫ్ తెలిపింది.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జూన్‌లోపు భారత్‌లో తమ మోటారు సైకిళ్ల అమ్మకాలు 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతాయని బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. జూలై-జూన్‌ను ఆర్థిక సంవత్సరంగా పరిగణించే ట్రయంఫ్, వచ్చే నెల నుంచి 2020 జూన్‌లోపు రెండు కొత్త వాహనాలను తేవాలని భావిస్తోంది.
also read బెంజ్, వోల్వో , ఆడి కార్లకు పోటీగా జాగ్వార్ కొత్త మోడల్ కారు
నూతన మోడల్ మోటారు సైకిళ్లు తమ సంస్థ అభివృద్ధికి దోహదపడతాయని ట్రయంఫ్ ధీమా వ్యక్తం చేస్తోంది. రూ.18 లక్షల ధర కలిగిన ప్రీమియం మోడల్ రాకెట్ 3ఆర్‌ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తమనుంచి వచ్చే మోటారు సైకిళ్లన్నీ బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగానే రూపొందించనున్నామని ట్రయంఫ్ పేర్కొంది.జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మోటారు సైకిళ్లను ఆవిష్కరిస్తామన్నది.
గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈసారి 9 నుంచి 10 శాతం వృద్ధిని సాధించామని, డిసెంబర్ నెలతో ముగిసే త్రైమాసికంలో సైతం ఐదు నుంచి 10 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని ట్రయంఫ్ మోటారు సైకిల్స్ ఇండియా జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూఖ్ చెప్పారు.
also read 2.74 సెకన్లలో 100 కి.మీ స్పీడ్: సరికొత్త స్పోర్ట్స్ బైక్ స్పెషాలిటీ
ఇప్పటి స్థాయిలోనే అమ్మకాలు కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1000 మోటార్‌సైకిళ్లను విక్రయిస్తామని సంస్థ ధీమా వ్యక్తం చేసింది. వచ్చే నాలుగు నెలల్లో కొత్త మోటారు సైకిళ్లను ఆవిష్కరిస్తామని తెలిపింది. ఇటీవలే విపణిలో ఆవిష్కరించిన 2500 సీసీ బైక్ రాకెట్ 3ఆర్ మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. నూతన సంవత్సరంలో ప్రతి నెలా 75-100 మోటారు సైకిళ్లను విక్రయించగలమని ఆశాభావంతో ఉంది.