జనరల్ మోటార్స్‌‌పై కన్నేర్ర చేసి.. చైనాకి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

ఒక్క అమెరికన్ ఉద్యోగాన్ని తీసివేసినా సహించే ప్రసక్తి లేదని ప్రముఖ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ యాజమాన్యాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దానికి బదులు చైనాలో యూనిట్ మూసేసుకోవాలని సూచించారు. 

Donald Trump Asks General Motors To Stop Making Cars In China

ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం)పై అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమన్నారు. స్వదేశంలో ఉద్యోగుల్ని తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అంతగా వ్యయ నియంత్రణ అవసరమనుకుంటే చైనాలో కార్ల తయారీనీ ఆపేయాలన్నారు. అమెరికా, కెనడాల్లో దాదాపు 14,800 ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నామని జనరల్ మోటార్స్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. 

జీఎం సీఈఓ మ్యారీ బర్రాపై ధ్వజం
ఉద్యోగుల కోత నిర్ణయంపై పునరాలోచించాలని సూచిస్తూనే జనరల్ మోటార్స్ సీఈవో మ్యారీ బర్రా తీరుపై విరుచుకుపడ్డారు. ఉద్యోగుల కోతతో 2020 నాటికి సంస్థాగత వ్యయం సుమారు 4.5 బిలియన్ డాలర్లు తగ్గవచ్చని జనరల్ మోటార్స్ భావిస్తున్నది.

దీనివల్ల ప్లాంట్ల ఎత్తివేతతో ఒహియో, మిచిగాన్ వంటి పలు కీలక రాష్ర్టాల్లోని ఉద్యోగాలకు ఎసరు వస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయాన్ని ఓసారి సమీక్షించుకోవాలని సూచించిన ట్రంప్.. అంతగా అవసరమైతే చైనాలో కార్ల తయారీ ప్లాంట్‌ను మూసుకోవాలని సలహా ఇచ్చారు. 

ఓహియోలో కొత్త ప్లాంట్ తెరవండి
చైనాలో కార్ల తయారీకి స్వస్తి పలికి, ఒహియోలో కొత్త ప్లాంట్‌ను తెరువాలని జనరల్ మోటార్స్ సీఈఓ మ్యారీ బర్రాతో చెప్పానని ది వాల్ స్ట్రీట్ జర్నల్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు.

అంతకుముందు వైట్‌హౌస్‌లోనూ జీఎం నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు. మరోవైపు తమ నిర్ణయాన్ని జీఎం సమర్థించుకున్నది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వెళ్తున్నట్లు జనరల్ మోటార్స్ సీఈఓ మ్యారీ బర్రా చెప్పారు.

చైనాపై సుంకాలను పెంచుతాం
చైనాకు మరోసారి సుంకాల హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. చైనా నుంచి అమెరికాకు వస్తున్న 200 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రస్తుతం విధిస్తున్న 10 శాతం టారీఫ్‌లను 25 శాతానికి పెంచే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు.

చైనాతో జరుగుతున్న చర్చలు ఆశాజనకంగా లేనిపక్షంలో ఆ దేశపు అన్ని దిగుమతులపై సుంకాలు తప్పవని హెచ్చరించారు. అర్జెంటీనాలో ఈ వారం రెండు రోజులపాటు జీ20 సమావేశాలు జరుగనుండగా, ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ కానున్నారన్న అంచనాల మధ్య ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇరుదేశాల అధినేతలు వాణిజ్య చర్చల్లో పాల్గొనే వీలుండగా, ఇందులో అమెరికాకు అనుకూలమైన ఫలితాలు రాకపోతే ఇప్పుడు సుంకాల నుంచి మినహాయింపు పొందుతున్న అన్నింటిపైనా బాదుడేనన్నారు.

బ్రెగ్జిట్‌తో బ్రిటన్ వ్యాపార లావాదేవీలకు రాం రాం
ఐరోపా యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలుగడం (బ్రెగ్జిట్)తో అమెరికా-బ్రిటన్ వాణిజ్యం దెబ్బతినవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే ఈ విషయంలో ఆలోచిస్తారన్న ఆశాభావాన్ని సోమవారం ట్రంప్ వైట్‌హౌజ్‌లో మాట్లాడుతూ అన్నారు.

బ్రెగ్జిట్ డీల్‌కు సర్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈయూ నుంచి బయటకు వస్తే ఇక తమతో వాణిజ్యానికి బ్రిటన్‌కు తలుపులు మూసుకున్నట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈయూలోని 27 దేశాల అధినేతలతో ఆదివారం బ్రెగ్జిట్ డీల్‌కు థెరిసా మే అంగీకారం కుదుర్చుకోగా, పార్లమెంట్‌లో దీనికి ఆమోదం లభించడం ఇప్పుడు థెరిసాకు సవాల్ మారుతున్నది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios