బీఎస్-6 ఎఫెక్ట్: డీలర్ల ఆఫర్లపై ఇంట్రెస్ట్ చూపని హైదరాబాదీలు
ఇయర్ ఎండర్ సందర్భంగా ఆటోమొబైల్ డీలర్లు బంపర్ ఆఫర్లతో కొనుగోలుదారులకు డీలర్లు స్వాగతం పలుకుతున్నా సత్ఫలితాలు ఉండటం లేదు. ఎక్స్ షోరూమ్ ధరలపైనా భారీ తగ్గించినా, రెండేళ్ల బీమా మొత్తం చెల్లిస్తామన్నా సేల్స్ లక్ష్యాన్ని చేరుకోలేదు. కొనుగోలుపై వినియోగదారులు అనాసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్: వెహికల్ సేల్స్ పెంచుకోవడానికి ఆటోమొబైల్ డీలర్లు పలు ఆఫర్లు, డిస్కౌంట్లతో సిద్ధమయ్యారు. ఇయర్‌ఎండర్‌ను తమకు అనువుగా మలుచుకునే ప్రయత్నిస్తున్నా కస్టమర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువగా జరిగినా లక్షాన్ని చేరుకోలేదు.
ఈ ఏడాది ముగింపునకు మరో 14 రోజులే మిగిలిఉంది. వీలైనన్ని ఎక్కువ వాహనాల విక్రయానికి డీలర్లు ఇస్తున్న ఆఫర్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై రూ. 5 వేలు, లగ్జరీ కార్లు, మధ్యతరగతి వేతన జీవులు కొనుగోలు చేసే వివిధ రకాల వాహనాలపైన రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గించి విక్రయిస్తున్నారు.
also read ఇంటర్నెట్‌తో బైక్.. తెలంగాణ, ఏపీల్లో ఫిబ్రవరిలో ఆవిష్కరణ
కొన్ని సంస్థలు రెండేళ్ల బీమా మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నాయి. అయినా కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కొత్త ఏడాదిలో కొత్త బండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో రెండుమూడు నెలలుగా వాహన కొనుగోళ్లు భారీగా తగ్గాయి.
దీనికితోడు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం బీఎస్–6 ప్రమాణాలు కల వాహనాలను ప్రవేశపెడుతోంది. వాహనం ఇంజిన్ సామర్థం పెంచడంతో పాటు ఇంధనాన్ని పూర్తిస్థాయిలో మండించి కాలుష్య కారకాలను బాగా తగ్గించే బీఎస్–6 వాహనాలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయగలవని భావిస్తోంది.
కానీ ఆటోమొబైల్ సంస్థలు జనవరి నుంచే వీటిని విక్రయానికి సిద్ధం చేస్తున్నాయి. సాధారణంగా రవాణారంగానికి చెందిన వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే భారీగా అమ్ముడవుతాయి. రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లు, రూ.లక్షల ఖరీదైన లగ్జరీ బైక్‌లు మొదలు మధ్యతరగతి బడ్జెట్‌లో లభించే వివిధ రకాల కార్లు, దిచక్ర వాహనాల అమ్మకాలే టాప్‌గేర్‌లో ఉంటాయి.
also read మారుతి సుజుకి నుండి 12 కొత్త మోడల్ కార్లు... 6 లక్షలకు పైగా సేల్స్...
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు వివిధ రకాల వాహనాలు నమోదైతే, వాటిలో 85% వరకు వ్యక్తిగత వాహనాలే ఉంటాయి. ఈ క్రమంలో భాగ్యనగరంలోని ఆటోమొబైల్ రంగం కూడా రవాణావాహనాల కంటే వ్యక్తిగత వాహన విక్రయాలపైనే ఆధారపడి ఉంది.
కానీ ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం వాహనరంగంపై పెను ప్రభావాన్ని చూపింది. తయారీ సంస్థలు కూడా వాహనాల తయారీని నిలిపివేశాయి. భాగ్య నగర మధ్యతరగతి కుటుంబాలను కూడా మాంద్యం ప్రభావితం చేసింది.కేంద్రం ప్రకటించిన కొన్ని సడలింపుల నేపథ్యంలో అమ్మకాలు ఊపందుకుంటాయని భావించినా గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉందని ఆటోమొబైల్ డీలర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు.
గతేడాది డిసెంబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 53,22,694 వాహన అమ్మకాలు జరిగారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 55,52,416 వాహనాలు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే 2,29,722 వాహనాలు ఎక్కువే అయినా, ఆర్థిక రంగం బాగుంటే మూడు లక్షల సంఖ్యను దాటేది.