న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ద్విచక్ర వాహనాల డీలర్ల వద్ద ఏడు లక్షల మోటారు సైకిళ్లు, స్కూటర్ల నిల్వలు ఉన్నాయి. కానీ డెడ్‌‌లైన్‌‌కు ముందే బీఎస్‌‌-4 వాహనాలను వదిలించుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేవని ఫాడా తెలిపింది. 

లాక్‌‌డౌన్‌‌ వలన ప్రజలు బయటకే రావడం లేదని ఫాడా ఫ్రెసిడెంట్‌‌ ఆశీష్‌‌ కాలే అన్నారు. ఈ పరిస్థితులలో ఎటువంటి అమ్మకాలు చేయలేమని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్‌‌లో మరింత కఠినం కావొచ్చని అభిప్రాయపడ్డారు.

‘పరిస్థితులు మా చేయి దాటాయని, ఇప్పుడు డీలర్‌‌‌‌ ఏం చేయలేడు’ అని ఫాడా అధ్యక్షుడు ఆశీష్‌‌ కాలే పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో ఫాడా వేసిన పిటిషన్‌‌ ఈ నెల 27వ తేదీన హియరింగ్‌‌ వచ్చే అవకాశం ఉంది.

కానీ ఈ డేట్‌‌కు ముందే తమ పిటిషన్‌‌ను పట్టించుకోవాలని సుప్రీంకోర్టును ‘ఫాడా’ కోరింది. ఒక వేళ సుప్రీం కోర్టు హియరింగ్ జరగకపోతే, ఓఈఎంలకు బీఎస్‌‌-4 స్టాక్స్ రిటర్న్‌‌ చేయడానికి ప్రయత్నిస్తామని ఫాడా అధ్యక్షుడు ఆశీష్ కాలే పేర్కొన్నారు.

నిల్వ ఉన్న వాహనాల విక్రయం విషయమై ఒరిజినల్‌‌ ఎక్యుప్‌‌మెంట్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్ ‌‌(ఓఈఎం)లతో చర్చిస్తామని ఆశీష్ కాలే తెలిపారు. లేకపోతే ఈ నష్టాన్ని చాలా మంది డీలర్లు భరించలేరని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రస్తుత పరిస్థితులలో వెహికల్స్‌‌ కొనడానికి కస్టమర్లు ఆసక్తి చూపించడం లేదని, ఒక వేళ కొనాలని ఉన్నా తమ నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారని ఆశీష్‌‌ అన్నారు. ఇప్పటికే బుకింగ్స్‌‌ చేసుకున్న కస్టమర్లు కూడా డెలివరీ తీసుకోవడానికి వెనుకడుగేస్తున్నారని తెలిపారు.

Also read:పెరిగిన ట్రాఫిక్.. తగ్గిన నెట్ స్పీడ్:టెలికం సంస్థలకు కొత్త సవాళ్లు

షో రూమ్‌‌లకు వెళ్లి వెహికల్స్‌‌ కొనుగోలు చేయడానికి కస్టమర్లు భయపడుతున్నారని ఫాడా చైర్మన్ ఆశీష్ పాలే ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే టూ వీలర్‌‌‌‌ సెగ్మెంట్‌‌లో 70 శాతానికి పైగా బీఎస్‌‌ 4 వెహికల్స్‌‌ అమ్ముడు కాకుండా ఉండిపోయాయని అన్నారు.

ఏడు లక్షల మోటారు సైకిళ్లు, స్కూటర్ల విలువ రూ.3,850 కోట్లు, 15 వేల ప్రయాణికుల వాహనాల విలువ రూ.1,050 కోట్లు, 12 వేల వాణిజ్య వాహనాల విలువ రూ.1,440 కోట్లు ఉంటుందని ఆశీష్ కాలే తెలిపారు. మొత్తంగా బీఎస్-4 నిల్వలు అమ్ముడు పోకపోతే డీలర్లు రూ.6,350 కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. 

ఈ నెల మధ్యకల్లా హీరో మోటో కార్ప్ నిల్వలు నాలుగు లక్షలకు పైగా ఉన్నాయని తేలింది. ఈ నెల 15వ తేదీ నుంచి షోరూములకు వినియోగదారుల రాక తగ్గిపోయిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల పూర్తిగా కస్టమర్ల రాక పడిపోయిందని డీలర్లు చెబుతున్నారు. 

వాహనాల నిల్వలపై స్పందించడానికి హీరో మోటోకార్ప్, హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా ఆటో తదితర సంస్థల ప్రతినిధులు ముందుకు రాలేదు.