Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: బీఎస్-4 వెహికల్స్ కు 2 నెలల గడువివ్వాలి ప్లీజ్

ఈ నెలాఖరుతో బీఎస్-4 వాహనాల విక్రయాలకు గడువు ముగియనున్నది. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరణ, దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో మరోసారి ఫెడరేషన్ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్ (ఫాడా) సుప్రీం కోర్టు తలుపు తట్టింది. 

Coronavirus Effect: BS4 Car Sales Could Be Extended By 2 Months
Author
New Delhi, First Published Mar 18, 2020, 2:25 PM IST

న్యూఢిల్లీ: ఈ నెలాఖరుతో బీఎస్-4 వాహనాల విక్రయాలకు గడువు ముగియనున్నది. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరణ, దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో మరోసారి ఫెడరేషన్ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్ (ఫాడా) సుప్రీం కోర్టు తలుపు తట్టింది. 
ప్రస్తుత గడువు లోగా బీఎస్​-4 స్టాక్​ వాహనాలు అమ్మలేమని.. మే 31 వరకు అమ్మకాలకు అనుమతివ్వాలని ఫాడా పిటిషన్​ దాఖలు చేసింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారించాలని కోరినట్లు ఫాడా అధ్యక్షుడు ఆశిష్​​ హర్షరాజ్​ కాలే తెలిపారు.

డీలర్ల వద్ద ప్రస్తుతం 8.35 లక్షల బీఎస్​-4 విక్రయం కాని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.4,600 కోట్ల వరకు ఉండొచ్చు అని ఆశిష్​​ హర్షరాజ్ కాలే తెలిపారు. వాణిజ్య, ప్యాసింజర్​ వాహనాల పరిస్థితి ద్విచక్ర వాహనాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు. గడువు పెంచాలని ఫిబ్రవరి 14నే ఫాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

తాజా పిటిషన్‌లో అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయని ఫాడా అధ్యక్షుడు ఆశీష్ హర్షరాజ్ కాలే పేర్కొన్నారు. కరోనా వైరస్​ వ్యాప్తితో అమ్మకాలు భారీగా క్షీణించాయన్నారు. వినియోగదారులు కొనుగోళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 
కరోనా వైరస్​ నేపథ్యంలో డీలర్లకు 60 నుంచి 70 శాతం వరకు విక్రయాలు తగ్గాయని ఫాడా అధ్యక్షుడు ఆశీష్ హర్షరాజ్ కాలే తెలిపారు. గత 3,4 రోజుల నుంచి పలు పట్టణాల్లో పరిస్థితులు మరీ క్లిష్టంగా మారాయన్నారు. 

బీఎస్​-4 వాహనాల విక్రయాలకు ఈ నెల 31 వరకు గడువు ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 29 వరకే అందుకు అనుమతిస్తున్నట్లు వాహన పరిశ్రమల విభాగం సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 1నుంచి బీఎస్​-6 వాహనాలకే రిజిస్ట్రేషన్​లు ఉంటాయని ఆయా రాష్ట్రాలు స్పష్టం చేసినట్లు తెలిపింది. 

ఈ విషయాలన్నింటిపైన సియామ్​ కూడా ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాలు అటు డీలర్లతో పాటు కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పిటిషన్​లో పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios